Digestive System : మనం వంటింట్లో ఉపయోగించే వాటిల్లో మిరియాలు ఒకటి. మనలో చాలా మందికి తెలిసిన మిరియాలు నల్ల మిరియాలు. వీటిని జలుబు, దగ్గు, కఫంతోపాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలను తగ్గించడంలో వాడుతూ ఉంటాం. మిరియాలల్లో మరొక రకం మిరియాలు కూడా ఉంటాయి. అవే తెల్ల మిరియాలు. ఇవి కూడా మనకు మార్కెట్ లో లభిస్తాయి. కానీ వీటిని చాలా మంది ఉపయోగించరు. తెల్ల మిరియాల వల్ల కూడా మనకు అనేక ఉపయోగాలు ఉంటాయి.
మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేసి, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో తెల్ల మిరియాలు ఎంతో సహాయపడతాయి. మన పొట్టలో నిమిషానికి మూడు సార్లు సముద్రంలో అలల మాదిరి ఉండే తరంగాలు వస్తుంటాయి. వీటిని పెరిస్టాలిసిస్ మూమెంట్స్ అంటారు. ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి ఇవి సహాయపడతాయి. మనం తిన్న ఆహారం జీర్ణాశయం, పేగులల్లో నిల్వ ఉండడం వల్ల ఆహారం పులిసి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పెరిస్టాలిసిస్ మూమెంట్స్ రావడం వల్ల మనం తిన్న ఆహారం జీర్ణాశయం, పేగులల్లో ఒకే చోట నిల్వ ఉండకుండా కిందికి జరుగుతుంది. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణం అయ్యి గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి.
కానీ కొందరిలో ఈ పెరిస్టాలిసిస్ మూమెంట్స్ ఎక్కువగా రావు. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. తెల్ల మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు. తెల్ల మిరియాలు మన జీర్ణాశయం, పేగులల్లో పెరిస్టాలిసిస్ మూమెంట్స్ ఎక్కువగా వచ్చేలా చేయడంలో సహాయపడతాయి. ఈ మూమెంట్స్ ఎక్కువగా రావడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి.
మన జీర్ణాశయంలో అనేక రకాల యాసిడ్ లు, ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆహారం జీర్ణం అవ్వడంలో సహాయపడతాయి. అజీర్తి సమస్య ఉన్న వారు తెల్ల మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఈ యాసిడ్ లు, ఎంజైమ్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో ఆహారం త్వరగా జీర్ణం అయ్యి అజీర్తి సమస్య తగ్గుతుంది.
తెల్ల మిరియాలను హెర్బల్ టీ, నీళ్లు, పాలు, కషాయాలలో వేసి మరిగించుకొని తాగవచ్చు. తెల్ల మిరియాల పొడిని సలాడ్స్, మెలకెత్తిన విత్తనాలపై కూడా వేసుకొని తినవచ్చు. ఈ విధంగా తెల్ల మిరియాలను వాడడం వల్ల గ్యాస్ట్రిక్, అజీర్తి సమస్యల నుండి బయట పడవచ్చు.