Spinach : ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలను తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. వాటిల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇక ఆ ఆకుకూరల్లో పాలకూర ఒకటి. దీంట్లో అనేక పోషకాలు దండిగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, విటమిన్ ఎ, సి, కె లు అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
పాలకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్, డయాబెటిస్, రక్తహీనత వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే అధిక బరువు తగ్గుతారు. అయితే పాలకూర ఆరోగ్యకరమే అయినప్పటికీ దాన్ని అధిక మోతాదులో తీసుకోరాదు. తీసుకుంటే తీవ్ర దుష్పరిణామాలు కలుగుతాయి.
పాలకూరను అధికంగా తీసుకోవడం వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ముఖ్యంగా పాలకూరలో ఉండే హిస్టామైన్ మోతాదు అధికం అయితే అలర్జీలను కలగజేస్తుంది. అలాగే పాలకూరను మోతాదుకు మించి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. పాలకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక అది ఎక్కువైతే కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి.
ఇక పాలకూరలో ఆగ్జాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో రోజూ తయారవుతూనే ఉంటుంది. అయితే పాలకూరను తీసుకోవడం వల్ల దీని మోతాదు శరీరంలో సహజంగానే పెరుగుతుంది. దీంతో కిడ్నీలు దీన్ని వడబోస్తాయి. అదే పాలకూరను అధికంగా తీసుకుంటే.. సదరు ఆగ్జాలిక్ యాసిడ్ బయటకు వెళ్లదు. దీంతో కిడ్నీల్లో పేరుకుపోతుంది. ఫలితంగా అది రాళ్లుగా మారుతుంది. కనుక పాలకూరను ఎట్టి పరిస్థితిలోనూ అధికంగా తీసుకోరాదు.
పాలకూర మోతాదు శరీరంలో అధికం అయితే శరీరం విష తుల్యంగా మారుతుంది. కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు అసలు పాలకూరను తీసుకోరాదు. తీసుకుంటే స్టోన్స్ మరింత ఎక్కువవుతాయి. అలాగే కిడ్నీలపై భారం పడి కిడ్నీలు చెడిపోయేందుకు అవకాశాలు ఉంటయి. ఇక గౌట్, కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు కూడా పాలకూరను తినరాదు.