గ్యాస్ ఏర్పడటమనేది నేటి రోజుల్లో అందరికి ఒక కామన్ సమస్యగా మారింది. శరీరానికి సరిపడని ఆహార పదార్ధాలు తినడం, సరి అయిన వేళలు పాటించకపోవడం, తినే పదార్ధాలలో అసమతుల్యత మొదలైనవి పోట్టలో గ్యాస్ ఏర్పడి పొట్ట ఉబ్బరించటానికి దోవతీస్తున్నాయి. అందరికి ఒకే రకమైన పదార్ధాలు గ్యాస్ ను కలిగించవు. వ్యక్తుల శారీరక స్ధితి, వారు చేసే శారీరక శ్రమ, ఆహార వేళలనుబట్టి కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. సాదారణంగా అందరికి కామన్ గా గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహార పదార్ధాలను చూద్దాం. బీన్స్, మష్రూమ్స్, ఆపిల్స్, కొన్ని పప్పు ధాన్యాలు మొదలైన షుగర్ అధికంగా వుండే ఆహారాలను మానవ శరీరం తేలికగా జీర్ణించుకోలేదు కనుక పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది.
చాలామందికి పాల సంబంధిత ఉత్పత్తులు గ్యాస్ సమస్యలను తెస్తాయి. జీర్ణక్రియలో లాక్టోస్ సరిగా జీర్ణం కాకపోతే పొట్ట ఉబ్బిపోతుంది. జున్ను, పాలు, గుడ్లు, గుడ్డు సొన మొదలైనవి ఎసిడిటీ కలిగిస్తాయి. ఇవి తిన్న గంట నుండి గంటన్నరలోపు తేడా గమనించవచ్చు. పిండిపదార్ధాలు అధికంగా వుండే బంగాళదుంప, మొక్కజొన్న, పాస్తా, గోధుమలు, బ్రెడ్ మొదలైనవి కూడా గ్యాస్ సమస్యలనిస్తాయి. ఇక పీచు పదార్ధాలలో అన్నీ కాదు కాని కొన్ని గ్యాస్ నిస్తాయి. పీచు పదార్ధాలైన ఓట్ బ్రాన్, బీన్స్, గోధుమలు, కొన్ని పండ్లు కూడా ఎసిడిటీనిస్తాయి.
దీనికి కారణం పీచు పదార్ధాలు ఎలా తిన్నవి అలా పెద్ద పేగులోకి చేరుతాయి. జీర్ణక్రియకు అధిక సమయం తీసుకునే కొవ్వు పదార్ధాలు కూడా గ్యాస్ ను కలిగిస్తాయి. తేలికగా జీర్ణం కాని చక్కెర రహిత పాల ఉత్పత్తులు సైతం గ్యాస్ నిస్తాయి. ఈ అయిదు రకాల తిండిపదార్ధాలు సాధారణంగా గ్యాస్ సమస్యలనిస్తాయి కనుక వీటిని వదలటం మంచిది. ఇవే కాక మీ వ్యక్తిగత అనుభవంలో ఏదేని ఆహారం గ్యాస్ కలిగిస్తోందనుకుంటే వాటిని కూడా వదలండి.