అంగస్తంభన లోపంతో ఇబ్బంది పడుతున్న చాలా మంది బయటకు చెప్పుకోవడానికి సంకోచిస్తుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి మొహమాట పడతారు. ఇది తగదు. ఈ సమస్య కేవలం శృంగారానికి సంబంధించినదే కాదు, గుండె జబ్బు, మధుమేహం వంటి ఇతరత్రా జబ్బులకు సంకేతం కావచ్చు. కాబట్టి డాక్టర్‌ను సంప్రదించి అన్ని విషయాలను విడమరిచి చెప్పడం మంచిది. ఏవైనా సమస్యలు ఉంటే ముందే గుర్తించవచ్చు. జీవనశైలి మార్పులతో తగ్గించుకునే మార్గాలను తెలుసుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళన, టెస్టోస్టిరాన్ మోతాదులు తగ్గడం వంటి రకరకాల అంశాలు స్తంభన లోపానికి దారి తీస్తుంటాయి. అనారోగ్యకరమైన ఆహారం దీని లక్షణాలను మరింత ఎక్కువ చేయవచ్చు. చికిత్సకు త్వరగా లొంగనంతగా ముదిరేలా చేయవచ్చు.
అందువల్ల స్తంభన లోపం ఉన్నవారు ఆరోగ్యకరమైన ఆహారం మీద ప్రత్యేక దృష్టి సారించాలి. పండ్లు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, జంక్ ఫుడ్, సంతృప్త కొవ్వు పదార్థాలను తగ్గించాలి. పోషకాలతో నిండిన, తక్కువ కొలెస్ట్రాల్ గల పదార్థాలు సామర్థ్యం పెరగడానికి తోడ్పడుతాయి. ఇతరత్రా సమస్యల ముప్పును తగ్గిస్తాయి.
వ్యాయామం ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది. ఇది స్తంభన లోపానికి చికిత్సగా పనిచేస్తుంది. వ్యాయామంతో శరీరమంతటికీ రక్త సరఫరా పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇవి రెండూ స్తంభన సామర్థ్యాన్ని పెంచేవే. స్తంభన లోపానికి కారణమయ్యే ఊబకాయం, గుండె జబ్బు, మధుమేహం వంటి సమస్యలు అదుపులో ఉండడానికి వ్యాయామం తోడ్పడుతుంది. కాబట్టి నడక, పరుగు, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, బరువులెత్తడం వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం మంచిది. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివి మేలు చేస్తాయి.
పొగ తాగితే గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ల వంటి రకరకాల సమస్యలు చుట్టు ముడతాయి. ఇది శృంగార సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే పొగ తాగడం వల్ల రక్తనాళాలు దెబ్బ తింటాయి. ఫలితంగా రక్త ప్రసరణ తగ్గుతుంది. దీంతో అంగం స్తంభించకపోవచ్చు. స్తంభించినా ఎక్కువ సేపు అలాగే ఉండకపోవచ్చు. కాబట్టి పొగ తాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి.
మానసిక ఒత్తిడితో స్తంభన లోపం తలెత్తడమే కాదు, ఒత్తిడి సైతం ఈ సమస్యకు కారణమవచ్చు. ఇది మానసికంగానూ ఇబ్బంది పెడుతుంది. ఎంతో మంది దీని గురించి బయటకు చెప్పుకోలేక లోపల లోపలే మథన పడుతుంటారు. ఇది ఆందోళన, కుంగుబాటుకు దారి తీస్తుంది. ఇలాంటి వాటితో సతమతం అవుతుంటే మానసిక నిపుణులను సంప్రదించడానికి వెనకాడొద్దు. ఒక మంచి సలహా ఎంతో ఉపశమనం కలిగించొచ్చు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి తోడ్పడవచ్చు. జీవితంలో ఒత్తిడికి కారణం అయ్యే అంశాలను ఎదుర్కోవడానికి ఉపయోగపడొచ్చు. ఇవి మానసిక ఆరోగ్యానికే కాదు, స్తంభన లోపం తగ్గడానికి తోడ్పడుతాయి.