Vegetables And Fruits Diet : ఊబకాయం.. ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కానీ చాలా మంది ఈ సమస్యను పట్టించుకోరు. కొందరు మాత్రం బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలల్లో శాస్త్రీయ పద్దతులతోపాటు అశాస్త్రీయ పద్దతులు అనేకం ఉంటాయి. అశాస్త్రీయ పద్దతులను పాటించడం వల్ల ఫలితం అంతగా ఉండదు. కనుక మనం శాస్త్రీయంగా నిరూపించబడిన పద్దతులను పాటిస్తేనే చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి ప్రయోగాత్మకంగా నిరూపించబడిన ఒక పద్దతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వారం రోజుల పాటు మనం తీసుకునే ఆహారం శరీరానికి అదనపు క్యాలరీలను అందించకుండా ఒంట్లో ఉన్న కొవ్వు నిల్వలను తగ్గించడానికి తయారు చేసిన డైట్ పద్దతి ఇది.
ముందుగా ఉండాల్సిన దాని కంటే అదనంగా ఎంత బరువు ఉన్నారో చూసుకోవాలి. అదనపు బరువును ఎలా లెక్కించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీ బరువును కేజీల్లో, మీ ఎత్తును సెంటీ మీటర్లలలో కొలవాలి. సెంటీ మీటర్లలలో మీ ఎత్తు నుండి 100 ను తీసివేయాలి. వచ్చిన విలువను 0.9 తో పెంచండి. ఇలా పెంచగా వచ్చిన అంకెనే మీరు ఉండాల్సిన బరువు. ఉన్న బరువు నుండి ఉండాల్సిన బరువును తీసివేస్తే ఎంత బరువు అదనంగా ఉన్నారో తెలుస్తుంది. మొదటి రోజు అరటి పండు తప్ప అన్ని రకాల తాజా పండ్లను తినాలి. మనకు నచ్చిన ఏ పండ్లనైనా తినవచ్చు. దీనికి పరిమితి అంటూ ఏమీ లేదు.

ఇక రెండవ రోజు అన్నీ రకాల కూరగాయలను మాత్రమే తినాలి. అల్పాహారంగా ఒక పెద్ద బంగాళాదుంపను ఉడికించి తినాలి. తరువాత బంగాళాదుంపను తినకుండా ఇతర కూరగాయలను ఉడికించి లేదా పచ్చిగా తినవచ్చు. నూనెను మాత్రం వాడకూడదు. మూడవ రోజూ అరటి పండు, బంగాళాదుంప తప్ప ఇతర కూరగాయలను, పండ్లను తినవచ్చు. ఉడికించిన కూరగాయలను, పండ్లను తప్ప ఏ ఇతర ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఈ రోజు నుండి శరీరంలో కొవ్వు నిల్వలు కరగడం ప్రారంభమవుతుంది. ఇక నాలుగవ రోజు ఎనిమిది అరటి పండ్లు, మూడు గ్లాసుల పాలను మాత్రమే తాగాలి. నాలుగవ రోజూ ఆకలి తక్కువగా ఉంటుంది.
రోజంతా హాయిగా గడిచిపోవడాన్ని గమనించవచ్చు. ఐదవ రోజు ఒక కప్పు అన్నం, ఆరు టమాటాలను తీసుకోవాలి. మధ్యాహ్నం ఒక కప్పు అన్నాన్ని కూరగాయలతో లేదా ఆకుకూరలతో నూనె లేకుండా వండిన కూరతో తినాలి. ఉదయం అల్పాహారంగా రెండు టమాటాలను తీసుకోవాలి. మిగిలిన టమాటాలను అవసరమైనప్పుడు తినాలి. ఆరవ రోజూ ఒక కప్పు అన్నం, కూరగాయలు, పండ్ల రసాలను తీసుకోవాలి. పచ్చివి లేదా వండిన కూరగాయలను తీసుకోవచ్చు. ఇక ఏడవ రోజు కూడా ఒక కప్పు అన్నం, కూరగాయలు, పండ్ల రసాలను తీసుకోవాలి. కూరగాయలను తగ్గించి పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి.
వారం తరువాత మన బరువులో మార్పు రావడాన్ని గమనించవచ్చు. ఈ పద్దతిని పాటిస్తూ శరీరం అవసరం మేరకు తింటే 4 నుండి 5 కేజీల బరువు తగ్గుతారు. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు ఈ పద్దతిని పాటించిన రెండు వారాల తరువాత లేదా మరలా ఇష్టం వచ్చినప్పుడు ఇదే పద్దతిని పాటించాలి. వారం రోజుల పాటు ఈ పద్దతిని పాటించడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఆహారపు అలవాట్లను మార్చుకుని పరిమితంగా తింటూ ఉంటే కచ్చితంగా బరువు తగ్గుతారు. ఈ పద్దతిని పాటిస్తూనే ఈ వారం రోజుల పాటు కనీసం ఏదో ఒక వ్యాయామాన్ని చేయాలి. రోజూ పది గ్లాసుల నీటిని తాగాలి. ఈ డైట్ పద్దతితోపాటు ఈ నియమాలను కూడా పాటిస్తే వారం రోజుల్లోనే 4 నుండి 5 కిలోల వరకు బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.