Red Chilli Powder : కారం.. రుచుల్లో ఇది ప్రధానమైనది. షడ్రుచుల్లో ఇది ఒకటి. మనం చేసే కూరలకు కారం చక్కటి రుచిని తీసుకు వస్తుంది. కారం సమానంగా లేకపోతే కూరలు చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కారం ఎక్కువగా తినడం కొన్ని ప్రాంతాల్లో పౌరుషానికి ప్రతీకగా చెబుతారు. కోపం రాని అలాగే కామ వాంఛలు రాని పురుషులకు కారం ఎక్కువగా వేసి పెట్టమని మన పెద్దలు చెబుతుంటారు. ఇది ఇలా ఉండగా కారం ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. అసిడిటి సమస్య ఉన్న వారు, అజీర్తి వ్యాధితో బాధపడే వారు, చిన్న పిల్లలు కారం ఎక్కువగా తింటే వారికి విరేచనాలు అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కారం ఎక్కువగా తింటే కొందరికి లాభం జరిగితే కొందరికి మాత్రం నష్టం జరుగుతుంది. అదే విధంగా కారం తినడం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని వైద్య నిపుణులు జరిపిన పరిశోధనల్లో తేలింది. కారం తింటే కడుపులో మంట పుడుతుందని, ప్రేగుకు పుండ్లవుతాయని, గుండెల్లో మంట పుడుతుందని, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుందని కొంతమంది వైద్యులు చెబుతుంటారు. ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కారం, ఉప్పు తగ్గించి తినమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. కారం, ఉప్పు లేని చప్పిడి తిండి తినలేక ఇబ్బంది పడుతున్న వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. అయితే కొన్ని అధ్యయనాలు వీటికి భిన్నంగా ఉన్నాయి.
చప్పిడి తిండి తినేవారికి కంటే కారం తినే వారే ఎక్కువ రోజులు బ్రతుకుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా కారం తినడం వల్ల కూరలు రుచిగా ఉండడంతోపాటు ఎక్కువ రోజులు జీవించవచ్చని నిరూపితమైందట. చైనా ప్రజల మీద జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడైయ్యాయని నిపుణులు చెబుతున్నారు. కారం, మిరియాలు వంటివి తిన్న వారిలో మరణాల సంఖ్య తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. కారం తినే వారు చనిపోవడానికి తక్కువ ఆస్కారం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అలా అని రోజూ గొడ్డు కారాన్ని తినకూడదని తగిన మోతాదులో మాత్రమే కారాన్ని తీసుకోవాలని వారు చెబుతున్నారు.
మరణాల సంఖ్య కారం తినని వారితో పోల్చితే కారం తినే వారిలో తక్కువగా ఉందని అధ్యయనంలో తేలిందట. వారానికి రెండు సార్లు మాత్రమే కారం తినే వారితో పోల్చినప్పుడు రోజూ కారం తినే వారిలో పది శాతం మరణించే అవకాశం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో స్త్రీ, పురుషుల భేదం కూడా లేదని పరిశోధకులు చెబుతున్నారు. అందులోనూ ఎండుకారం కంటే పచ్చిమిర్చి మరింత మేలు చేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది.
అయితే ప్రపంచ శాస్త్రవేత్తలు మాత్రం చైనాలోని పరిసరాలు, ప్రాంతాలు, అక్కడి సాంప్రదాయ వంటల వల్ల అలా జరిగి ఉండవచ్చని అన్ని చోట్ల దాని ఫలితాలు ఇలాగే వస్తాయని నమ్మడానికి అవకాశం లేదని అంటున్నారు. కారం తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని కదా అని కారాన్ని అమితంగా తిని అనర్థాలను కొని తెచ్చుకోవద్దని దేనినైనా మితంగా వాడితేనే మనకు మేలు కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.