Sweat : మనం సాధారణంగా మన శరీరంపై ఉండే దుమ్మును, ధూళిని తొలగించుకోవడానికి అలాగే చెమట ఎక్కువగా పట్టినప్పుడు స్నానం చేస్తూ ఉంటాము. స్నానం చేయడం వల్ల మనం తాజా అనుభూతిని పొందవచ్చు. అయితే మనలో చాలా మందికి స్నానం చేసిన తరువాత కూడా విపరీతంగా చెమటలు పడుతూ ఉంటాయి. స్నానం చేసిన అనుభూతే ఉండదు. ఇలా మనలో చాలా మందికి జరిగే ఉంటుంది. అసలు స్నానం చేసిన తరువాత చెమట ఎక్కువగా ఎందుకు పడుతుంది.. ఇలా చెమట పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్నానం చేసిన తరువాత చెమట పట్టడం వల్ల కోపం, చిరాకు వస్తూ ఉంటుంది. వేడి నీటి స్నానం చేసినప్పుడు ఈసమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.
వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం, జుట్టు వెచ్చగా మారతాయి. అలాగే వేడి నీటితో వచ్చే ఆవిరి కారణంగా బాత్ రూం ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అలాగే స్నానం చేసిన తరువాత టవల్ తో శరీరాన్ని తుడుచుకుంటూ ఉంటాము. ఇలా తుడుచుకోవడం వల్ల టవల్ కు మరియు చర్మానికి మధ్య జరిగే రాపిడి వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరిగి చెమట పడుతుంది. ఇలా స్నానం చేసిన తరువాత చెమట పట్టకుండా ఉండాలంటే వీలైనంత వరకు గోరు వెచ్చని నీరు, చల్లటి నీటితో స్నానం చేయాలి. ఒకవేళ వేడి నీటితో స్నానం చేసినప్పటికి చివరగా ఒక మగ్గు చల్లటి నీటిని శరీరంపై పోసుకోవాలి. అలాగే వ్యాయామాలు లేదా శారీరక శ్రమ చేసిన 20 నిమిషాల తరువాత స్నానం చేయాలి.
అదే విధంగా తలస్నానం చేసే వారు జుట్టును గోరు వెచ్చని నీటితో లేదా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే తలస్నానం చేసిన తరువాత జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్ ను ఉపయోగించకపోవడమే మంచిది. అలాగే స్నానం చేసిన తరువాత ఎక్కువగా చెమట పట్టే వారు వీలైనంత త్వరగా స్నానం చేసి బాత్రూం నుండి బయటకు రావాలి. అలాగే స్నానం చేసిన తరువాత శరీరాన్ని టవల్ తో నెమ్మదిగా తుడుచుకోవాలి. అలాగే స్నానం చేసిన తరువాత వెంటనే బయటకు వచ్చి ఆ తరువాత బట్టలు వేసుకోవాలి. బాత్ రూంలో ఆవిరి కారణంగా తేమ వాతావరణం ఉంటుంది. దీని వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. కనుక బాత్ రూం నుండి బయటకు వచ్చిన తరువాత బట్టలను మార్చుకోవాలి. ఈ విదంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల స్నానం చేసిన తరువాత చెమట పట్టకుండా శరీరం తాజాగా ఉంటుంది.