లావెక్కిపోతున్నాను, షేప్ మారిపోతోంది….అనుకుంటున్న మహిళలకు కొన్ని సూచనలు. సాధారణంగా మీరనుకుంటున్న భయాలు వయసుతో వచ్చేవి. వయసు రావటం సహజమే. కాని దానికి ఎదురీదండి. ఈ చిన్నపాటి చిట్కాలతో వయసు పైబడే ప్రక్రియను మందగించండి. చర్మ సంరక్షణ – ముడుతలు రావడం సహజం. ప్రత్యేకించి కళ్ళ చుట్టూ, ముక్కు పక్కనా లైన్లు వచ్చేస్తాయి. ఎండల కారణంగా రంగు కూడా మారుతుంది. వీటికి మీరు చేయాల్సింది…ఆ భాగాలను బాగా రుద్దటం, తగినంత సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములు వాడటం చేయాలి. ముడతలకు బొటాక్స్ వాడచ్చు. ముడుతలు పోవాలంటే ఆలివ్ ఆయిల్ ఎంతో ఉపయోగిస్తుంది.
బరువు – ఎప్పటికపుడు బరువు సరిచూసుకుంటూ వ్యాయామాలు చేయండి. రోజూ కనీసం 30 నిమిషాలు చేస్తే శరీర ఎదుగుదల అదుపులో వుంటుంది. మీ వ్యాయామం యోగా, ఎరోబిక్స్, స్విమ్మింగ్ ఏదైనా కావచ్చు. ఏదో ఒక శారీరక వ్యాయామం మొదలుపెట్టి దానిని కొనసాగించాలి. ముఖానికి సంబంధించిన వ్యాయామాలు కూడా చేసి ముఖ కండరాలను మెరుగుపరచండి. ఆహారం – మీ ఆహారంలో అధికంగా పచ్చటి కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, గింజలు, బీన్స్ మొదలైనవి వుండాలి. 75 శాతం మొక్కల నుండి వచ్చిన ఆహారంగా వుండాలి. మిగిలినది. పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసంగా వుండాలి. ఈ రకమైన ఆహారం మీకు ఎముకల అరుగుదల, డయాబెటీస్, గుండె వ్యాధులు రాకుండా చేస్తుంది.
కాల్షియం అధికంగా – కాల్షియం, విటమిన్ డి లు వుండే తక్కువ కొవ్వుకల పాల ఉత్పత్తులు, సోయా మిల్స్, ఆరెంజ్ జ్యూస్, చేపలు, వైద్యుల సలహా మేరకు ఇతర అదనపు ఆహారాలు తీసుకోండి. లిక్కర్ – తాజా పరిశోధనలమేరకు ఆల్కహాల్ మితంగా తీసుకుంటే గుండెను సంరక్షిస్తుందట. కనుక అతిగా కాకుండా రోజుకు 30 మి.లీ. చొప్పున ఒక్కసారిగా తీసుకోవడం ఆరోగ్యాన్ని సంరక్షించగలదు. నిద్ర తగినంతగా – చాలా మంది రోజుకు 5 లేదా 6 గంటలు మాత్రమే నిద్రిస్తారు. ఇది చాలదు. రోజుకు కనీసం 7 నుండి 8 గంటలపాటు రాత్రి నిద్ర అవసరం. అవసరమనుకుంటే పగటిపూట మధ్యాహ్నం వేళ 10 నుండి 15 నిమిషాలపాటు నిద్రించటం కూడా మంచిదే. షుగర్, ఉప్పు – ఈ రెండు పదార్ధాలు, ఆరోగ్యానికి హానికరమని గుర్తించండి. వీలైనంత తక్కువగా వీటిని ఉపయోగిస్తే, మీ ఆరోగ్యం బాగుంటుంది.