Pomegranate Juice : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో దానిమ్మ పండు కూడా ఒకటి. దానిమ్మ చెట్టును చాలా మంది ఇండ్లలో కూడా పెంచుకుంటారు. ఈ పండ్లను తినడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ తోపాటు ఇతర పోషకాలన్నీ దానిమ్మ పండులో ఉంటాయి. దానిమ్మ పండ్లే కాకుండా దానిమ్మ చెట్టు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దానిమ్మ పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఉండే రక్తాన్ని శుద్ధి చేయడంలో దానిమ్మ పండును మించింది లేదు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, రక్తంలో ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దానిమ్మ పండ్లు ఎంతో సహాయపడతాయి.
గుండె జబ్బులతో బాధపడే వారు తరచూ దానిమ్మ పండ్లను తినడం వల్ల గుండె బలంగా తయారవుతుంది. డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను నివారించడంలో కూడా దానిమ్మ ఉపయోగపడుతుంది. కడుపులో మంట, జ్వరం, గొంతు, నోటి సమస్యలతో బాధపడే వారు దానిమ్మ గింజలను తినడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 100 గ్రాముల దానిమ్మ గింజలలో 83 క్యాలరీల శక్తి, 18 గ్రాముల పిండి పదార్థాలు, 4 గ్రాముల పీచు పదార్థాలు, 1.17 గ్రాముల కొవ్వు పదార్థాలు, 1.67 గ్రాముల ప్రోటీన్స్, 10. 2 మిల్లీ గ్రాముల విటమిన్ సి, 10 మిల్లీ గ్రాముల కాల్షియం, 12 మిల్లీ గ్రాముల మెగ్నిషియం, 257 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటాయి. దానిమ్మ పండును వలుచుకుని తినడం కష్టంగా భావిస్తారు. కానీ దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.
దానిమ్మ గింజల రసాన్ని చర్మానికి రాసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. అల్జీమర్స్ తో బాధపడే వారు దానిమ్మ పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజూ పావు కప్పు దానిమ్మ పండ్ల రసాన్ని తాగడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగుతుంది. ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. గర్భస్థ శిశువులకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ దానిమ్మ పండ్లల్లో పుష్కలంగా ఉంది. గర్భిణీలు రోజూ ఒక గ్లాసు దానిమ్మ పండ్ల రసాన్ని తాగడం వల్ల గర్భస్థ శిశువులు ఆరోగ్యంగా ఉంటారు. ఇలా తాగడం వల్ల నెలలు నిండకుండా అయ్యే ప్రసవం ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ పండ్లు యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. నీళ్ల విరేచనాలు, నోటి పూత, దంతాలు, చిగుళ్ల సమస్యలను తగ్గించడంలో కూడా దానిమ్మ పండ్లు సహాయపడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పేరుకు పోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను రాకుండా చేయడంలో కూడా దానిమ్మ పండ్లు తోడ్పడతాయి. అధిక రక్త పోటుతో బాధపడే వారు తరచూ దానిమ్మ పండ్లను తినడం వల్ల రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. దానిమ్మ గింజలను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నా లేకున్నా వారానికి ఒకసారి ఒక గ్లాస్ దానిమ్మ పండ్ల రసాన్ని తాగడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.