Immunity : మన శరీరం చక్కటి రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉండడం చాలా అవసరం. చక్కటి రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉండడం కూడా అదృష్టమనే చెప్పాలి. కానీ ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగా రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. సాధారణ జలుబుకు కూడా మనం మందులు వేసుకుంటున్నాం. మందులు వేసుకోవడం వల్ల జలుబు తగ్గుతుంది. కానీ ఆ మందులను తట్టుకునే శక్తి మనకు ఉందా లేదా అనేదే చాలా ముఖ్యం. తరచూ అనారోగ్య సమస్యలు వచ్చినా, చిన్నపాటి క్రిముల వల్ల కూడా రోగాల బారిన పడితే మనలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం.
రోడ్డు మీద నడిచినా సరే ఆ కాలుష్యం మన మీద ప్రభావం చూపిస్తుంది. మన శరీరంలో ఉండే తెల్ల రక్తకణాలు, యాంటీ బాడీస్ మన శరీరంలోకి ప్రవేశించే క్రిములతో నిరంతరం పోరాటం చేస్తూ ఉంటాయి. అయితే కొందరిలో ఈ రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ రోగ నిరోధక శక్తిని మనం సహజసిద్ధ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా పెంచుకోవచ్చు. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయలను తీసుకోవడం వల్ల కూడా మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దీనిలో విటమిన్ సి తో పాటు క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఉసిరికాయలను ఎండబెట్టి పొడిగా చేయాలి. ఆ పొడిని నీళ్లల్లో కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పసుపు కూడా మన రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. పసుపులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. శరీరంలో ఏర్పడే మూడు రకాల దోషాలను పసుపు నియంత్రిస్తుంది. రోగ నిరోధక వ్వవస్థను మెరుగుపరుస్తుంది.
రోజూ వేడి పాలల్లో ఒక గ్రాము పసుపును కలిపి తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి తరచూ అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాం. అదే విధంగా అల్లం కూడా రోగ నిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అనారోగ్య సమస్యలను, ఇన్ ఫెక్షన్ లను తగ్గించడంలో అల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నువ్వుల నూనెలో అల్లం పొడిని కలిపి నొప్పులపై రాసి మర్దనా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలను నయం చేసే గుణం కూడా అల్లానికి ఉంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు నిత్యం తులసి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.
ఇవే కాకుండా కేవలం పది నిమిషాల్లోనే రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే మార్గాలు కూడా ఉన్నాయి. 10 నిమిషాల్లో రోగ నిరోధక శక్తి ఎలా పెరుగుతుంది అని చాలా మంది సందేహపడుతుంటారు. ఒక పెద్ద గిన్నెలో 10 నుండి 15 ఐస్ క్యూబ్స్ ను వేసి నీటిని పోయాలి. తరువాత అందులో పాదాలను ఉంచాలి. ఈ విధంగా రాత్రి పడుకునే ముందు చేయాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి వెంటనే పెరుగుతుంది. అదే విధంగా చల్లటి నీటితో షవర్ బాత్ చేసినాయ కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
షవర్ బాత్ చేసే సమయంలో మొదట శరీరం తనను తాను వెచ్చగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో జీవక్రియ రేటు పెరుగుతుంది. అప్పుడు తెల్ల రక్తకణాల ఉత్పత్తి మరింత జరుగుతుంది. దీంతో వ్యాధి నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. ఇక చల్లటి నీటిలో స్విమ్మింగ్ చేసినా కూడా మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే ఒక బకెట్ లో ఐస్ క్యూబ్స్ మరియు నీటిని పోయాలి. ఈ బకెట్ లో నీటిని ఒకేసారి తలపై పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా తెల్ల రక్తకణాల ఉత్పత్తి జరిగి రోగ నిరోధక వ్యవస్థ అమాంతం పెరుగుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడి అనారోగ్యాల బారిన అలాగే ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటామని నిపుణులు సూచిస్తున్నారు.