Bananas : అరటి పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. మనలో చాలా మంది తినే పండ్లల్లో అరటి పండ్లు ఒకటి. ఇవి మనకు విరివిరిగా, తక్కువ ధరలో లభిస్తాయి. పండ్లన్నింటిలో కంటే అరటి పండును తినడం వల్ల మనకు ఎక్కువ శక్తి లభిస్తుంది. 100 గ్రా. ల అరటి పండులో 116 క్యాలరీల శక్తి ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా సులువుగా తినవచ్చు. అరటి పండును షుగర్ వ్యాధి గ్రస్తులు తినవచ్చా.. అరటి పండును తినడం వల్ల బరువు పెరుగుతారా.. పెరుగన్నంలో అరటి పండును కలిపి తినవచ్చా.. వంటి అనేక సందేహాలు మనలో చాలా మందికి వస్తూ ఉంటాయి.
అరటి పండులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు రోజుకు ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ అరటి పండ్లను తినరాదు. బరువు పెరగాలనుకునే వారు రోజుకి మూడు లేదా నాలుగు అరటి పండ్లను తినవచ్చు. అరటి పండ్లలో శక్తి అధికంగా ఉంటుంది. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. కనుక వీటిని తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు చిన్న అరటిపండును రోజుకు ఒకటి తినవచ్చు లేదా అరటి పండును తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పెరుగన్నంలో అరటి పండును కలిపి తినవచ్చు. ఇలా తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. కానీ ఇలా తినడం వల్ల ఎక్కువ క్యాలరీలు శరీరానికి లభించి బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరగాలనుకునే వారు, శారీరక శ్రమ అధికంగా చేసే వారు పెరుగన్నంలో అరటి పండ్లను కలిపి తినవచ్చు.
ఉప్పు, నూనె లేని ఆహార పదార్థాలను తినే వారు కూడా పెరుగన్నంలో అరటి పండును కలిపి తినవచ్చు. మలంలో రక్తం వచ్చే వారు పెరుగన్నాన్ని అధికంగా తింటూ ఉంటారు. అలాంటి వారు కూడా పెరుగన్నంలో అరటి పండును కలిపి తినవచ్చు. కానీ వీలైనంత వరకు ఉడికించిన ఆహార పదార్థాలతో పండ్లను కలిపి తినవద్దు. ఉడికిన ఆహార పదార్థాలు జీర్ణ మయ్యే సమయం, పండ్లు జీర్ణమయ్యే సమయం వేరువేరుగా ఉంటుంది. కనుక పెరుగన్నాన్ని, అరటి పండును కలిపి తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.