Jeera Rice : మనం వంటింట్లో రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. వంటలను తయారు చేయడానికి ముందుగా మనం తాళింపును చేస్తాం. తాళింపులో వాడే పదార్థాలలో జీలకర్ర కూడా ఒకటి. ఇది మనందరికీ తెలిసిందే. కానీ జీలకర్ర వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మాత్రం చాలా మందికి తెలియవు. జీలకర్రను వంటల్లో వాడడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో, శరీరంలో ఉండే నొప్పులను, వాపులను తగ్గించడంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. వంటల్లోనే కాకుండా జీలకర్రను ఉపయోగించి జీరా రైస్ ను కూడా చేసుకోవచ్చు. జీరా రైస్ ఎంతో రుచిగా ఉంటుంది. చాలా సులువుగా దీనిని మనం తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ జీరా రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీరా రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నాన బెట్టిన బియ్యం – ఒక కప్పు, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు -5, యాలకులు – 3, ఉప్పు – రుచికి తగినంత, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – ఒకటిన్నర కప్పు.
జీరా రైస్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి కరిగిన తరువాత జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ముందుగా నానబెట్టిన బియ్యాన్ని, ఉప్పును, కొత్తిమీరను వేసి కలిపి నీళ్లు పోసి మరోసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మరోసారి అంతా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జీరా రైస్ తయారవుతుంది. దీనిని బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. జీరా రైస్ ను నేరుగా లేదా మిర్చి కా సాలన్, చికెన్ కుర్మాలతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.
అప్పుడప్పుడు ఇలా జీరా రైస్ ను తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతోపాటు జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. జీలకర్రను తరుచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. స్త్రీలలో నెలసరిని క్రమబద్దీకరించడంలో కూడా జీలకర్ర ఉపయోగపడుతుంది. చర్మంపై ముడతలు రాకుండా చేయడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ జీలకర్ర ఉపయోగపడుతుంది.