Cucumber Raita : కీరదోస మన శరీరానికి ఎంత చలువ చేస్తుందో అందరికీ తెలిసిందే. అందుకనే దీన్ని వేసవిలో చాలా మంది తింటుంటారు. ఇక ఈ సీజన్‌లో పెరుగు, మజ్జిగను కూడా ఎక్కువగానే తీసుకుంటుంటారు. ఇవి కూడా మన శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. వేసవి తాపం నుంచి బయట పడేస్తాయి. అయితే కీరదోస, పెరుగు ఉపయోగించి తయారు చేసే మజ్జిగ రైతాను తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. ఇలా రైతాను తయారు చేసుకుని రోజూ అన్నంలో కలిపి తినాలి. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక కీరదోస రైతాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కీరదోస రైతా తయారీకి కావల్సిన పదార్థాలు..
కీరదోస ముక్కలు – అర కప్పు, పెరుగు – రెండు కప్పులు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీస్పూన్, జీలకర్ర పొడి – అర టీస్పూన్, కొత్తిమీర – కొద్దిగా, ఉల్లిపాయ – సగం.
కీరదోస రైతా తయారు చేసే విధానం..
పెరుగులో తగినంత నీళ్లు కలిపి బాగా తిప్పాలి. మరీ పలుచగా ఉండాలనుకుంటే నీళ్లను ఎక్కువగా పోయాలి. లేదా తక్కువగా నీళ్లను పోయాలి. పెరుగులో అలా నీళ్లను పోసి బాగా కలియబెట్టాలి. అనంతరం అందులో కీరదోస ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు వరుసగా వేస్తూ బాగా తిప్పాలి. చివరిగా కొత్తిమీర వేసి కలపాలి. దీంతో కీరదోస రైతా రెడీ అవుతుంది. అయితే చల్లగా కావాలనుకుంటే దీన్ని ఒక గంటపాటు ఫ్రిజ్‌లో పెడితే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న రైతాను అన్నంలో కలిపి లేదా నేరుగా తాగవచ్చు. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
కీరదోస రైతాను తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి మొత్తం పోతుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. ఎండదెబ్బ బారిన పడకుండా ఉంటారు. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. గ్యాస్, మలబద్దకం, కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరంలోని ద్రవాలు త్వరగా ఖర్చు కాకుండా ఉంటాయి.