Sweet Curd : మనం పెరుగును రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. పెరుగును ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. పాలలో పంచదార సిరప్ ను వేసి మనం స్వీట్ కర్డ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. దీనినే మిష్టి దోయ్, మీఠా దహీ అని కూడా పిలుస్తారు. ఇది బెంగాలీల సాంప్రదాయ వంటకం. ఈ స్వీట్ కర్డ్ ను మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. పెరుగును నేరుగా తినలేని వారు ఇలా స్వీట్ కర్డ్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ కర్డ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ కర్డ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కని పాలు – ఒక లీటర్, పంచదార – 100 గ్రా., పెరుగు – 3 లేదా 4 టీ స్పూన్స్.
స్వీట్ కర్డ్ తయారీ విధానం..
ముందుగా పెరుగును తీసుకుని జల్లి గిన్నె లేదా వస్రంలో ఉంచి నీరు లేకుండా చేసుకోవాలి. ఒక గిన్నెలో పాలను తీసుకుని కలుపుతూ పాల పరిమాణం తగ్గి పాలు రంగు మారే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలలో 50 గ్రా., ల పంచదారను వేసి పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఒక కళాయిలో మిగిలిన పంచదారను వేసి కలుపుతూ చిన్న మంటపై పంచదార మొత్తం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత సిరప్ లా తయారవుతుంది. దీనిని ముందుగా మరిగించి ఉంచిన పాలలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పాలను ఒక మట్టి గిన్నెలోకి తీసుకోవాలి. పాలు గోరు వెచ్చగా ఉన్నప్పుడు నీళ్లు లేకుండా చేసిన పెరుగును వేసి పెరుగంతా పాలలో కలిసిపోయేలా బాగా కలిపి మూత పెట్టాలి. ఈ పాలను ఒక రాత్రి అంతా కదిలించకుండా ఉంచడం వల్ల పాలు తోడుకుని పెరుగుగా మారుతుంది. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ కర్డ్ తయారవుతుంది. మట్టి గిన్నెలో పాలను ఉంచడం వల్ల పెరుగు రుచి పెరగడంతోపాటు గట్టిగా తయారవుతుంది. ఇది అందుబాటులో లేని వారు మామూలు గిన్నెలో అయినా పాలను తోడువేయవచ్చు. ఇలా తయారు చేసుకున్న స్వీట్ కర్డ్ ను తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. వేసవి కాలంలో ఇలా స్వీట్ కర్డ్ ను తయారు చేసుకుని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.