Pesara Pappu Kichdi : పెసలను తినడం వల్ల మన శరీరానికి ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో మాంసాహారానికి సమానంగా పోషకాలు ఉంటాయి. కనుక నాన్‌వెజ్ తినలేని వారు వీటిని తింటే ఎంతో మేలు జరుగుతుంది. మన శరీరానికి పోషకాలు లభించడంతోపాటు వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక పెసలను నేరుగా తినలేని వారు వాటితో కిచిడీ కూడా తయారు చేసి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇక పెసర పప్పు కిచిడీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పప్పు కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – రెండు కప్పులు, పెసర పప్పు – అర కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, లవంగాలు – 3, యాలకులు – 2, దాల్చిన చెక్క – 2, బిర్యానీ ఆకు – 1, మిరియాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 4, కరివేపాకు – ఒక రెబ్బ, జీడి పప్పు – ఒక టేబుల్ స్పూన్, ఆలుగడ్డ – ఒకటి, క్యారెట్ – ఒకటి, పచ్చి బఠానీలు – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన టమాటాలు -2, పుదీనా ఆకులు – 10, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – 6 కప్పులు.
పెసర పప్పు కిచిడీ తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని, పెసర పప్పును కడిగి తగినన్ని నీళ్లను పోసి నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి కాగాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు, జీడిపప్పును వేసి వేయించుకోవాలి. తరువాత ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయే వేయించుకోవాలి. తరువాత టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక నానబెట్టుకున్న బియ్యం, పెసర పప్పు, రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత నీళ్లను పోసి కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసర పప్పు కిచిడీ తయారవుతుంది. దీనిని అల్పాహారంగా లేదా భోజనంలో భాగంగా కూడా తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు.. మనకు పోషకాలు.. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కనుక దీన్ని తరచూ తీసుకోవాలి.