Sprouts Salad : ప్రస్తుత కాలంలో వచ్చిన ఆహారపు అలవాట్ల కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. ఈ సమస్యల నుండి బయట పడడానికి చాలా మంది వైద్య నిపుణులు మొలకెత్తిన విత్తనాలను తినమని సూచిస్తున్నారు. మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. వీటిని ఆహారంగా తీసుకునే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. మొలకెత్తిన విత్తనాలను ఆహారంగా తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా బరువు తగ్గడంలో ఇవి ఎంతో సహాయపడతాయి.
మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కండ పుష్టికి వ్యాయామాలు చేసే వారికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. శనగలు, పెసలు, పల్లీలు, అలసందలు, బొబ్బర్ల వంటి వాటిని మనం మొలకెత్తిన విత్తనాలుగా తయారు చేసుకోవచ్చు. వీటిని కొంతమంది నేరుగా తినలేరు. అలాంటి వారు వీటిని సలాడ్ లా చేసుకుని తినవచ్చు. ఇక మొలకెత్తిన విత్తనాలతో సలాడ్ ను ఏవిధంగా చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకల సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసలు – రెండు కప్పులు, అలసందలు – ఒక కప్పు, శనగలు – అర కప్పు, పల్లీలు – అర కప్పు, తరిగిన క్యారెట్ – అర కప్పు, తరిగిన క్యాప్సికమ్ – అర కప్పు, తరిగిన టమాట – ఒకటి, తరిగిన ఉల్లిపాయ – ఒకటి, కారం – అర టీ స్పూన్, చాట్ మసాలా – చిటికెడు, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మొలకల సలాడ్ తయారీ విధానం..
ముందుగా పెసలను, అలసందలను, పల్లీలను, శనగలను వేరు వేరుగా శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 5 నుండి 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిని వేరు వేరుగా శుభ్రమైన వస్త్రంలో మూట కట్టి 7 నుండి 8 గంటల పాటు కదిలించకుండా ఉంచాలి. ఇలా చేయడం వల్ల మొలకలు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు వస్త్రం నుండి మొలకలను నెమ్మదిగా వేరు చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. వీటితోపాటు పైన చెప్పిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మొలకల సలాడ్ తయారవుతుంది. రోజూ ఉదయం మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. మొలకెత్తిన విత్తనాలను నేరుగా తినడమే చాలా మంచిది. అలా నేరుగా తినలేని వారు ఈ విధంగా సలాడ్ లా చేసుకుని తినడం వల్ల కూడా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.