Sweet Corn Soup : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి వాటితో బాధపడుతున్నప్పుడు వేడి వేడిగా ఏదైనా సూప్ ను తాగాలనిపించడం సహజం. అలాంటప్పుడు మనం ఎక్కువగా బయట దొరికే సూప్ ప్యాకెట్లను తెచ్చుకుని తయారు చేసుకుని తాగుతూ ఉంటాం. కానీ అవి అంత రుచిగా ఉండవు. బయట కొనుగోలు చేసే పని లేకుండా మనం ఇంట్లోనే చాలా రుచిగా సూప్ ను తయారు చేసుకుని తాగవచ్చు. అచ్చం రెస్టారెంట్లలో లభించే విధంగా ఉండే స్వీట్ కార్న్ సూప్ ను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ కార్న్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ – పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ, నీళ్లు – ముప్పావు లీటర్, వెన్న – అర టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 3, చిన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, పంచదార – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్.
స్వీట్ కార్న్ సూప్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో స్వీట్ కార్న్ గింజలను, పావు కప్పు నీళ్లను తీసుకోవాలి. వీటిని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్లను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో వెన్నను వేసి వేడి చేయాలి. వెన్న కరిగిన తరువాత వెల్లుల్లి రెబ్బలను, స్ప్రింగ్ ఆనియన్స్ ను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత క్యారెట్ ముక్కలను వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
తరువాత మరో 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ గింజలను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముప్పావు లీటర్ నీటిని పోయాలి. నీరు పోసిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించే కొద్ది పైన తేటలాగా ఏర్పడుతుంది. ఈ తేటను సాధ్యమైనంత వరకు గంటెతో తొలగించాలి. తరువాత చిల్లీ సాస్, వెనిగర్, మిరియాల పొడి, పంచదార వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ముందుగా సిద్దం చేసుకున్న కార్న్ ఫ్లోర్ నీటిని వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పైన మరికొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ను చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా ఉండే స్వీట్ కార్న్ సూప్ తయారవుతుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటివి బాధిస్తున్నప్పుడు ఇలా తయారు చేసుకున్న స్వీట్ కార్న్ సూప్ ను తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది.