Chicken Soup : ఈ సీజన్‌లో మనం సహజంగానే అనేక వ్యాధుల బారిన పడుతుంటాం. అనేక సమస్యలు మనల్ని చుట్టు ముడుతుంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల మనకు దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమయంలో మనం అన్ని పోషకాలు ఉండే బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా వ్యాధుల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఇక మనకు శక్తిని, పోషణను అందించే ఆహారాల్లో చికెన్ సూప్ కూడా ఒకటి. ఇది ఎంతో ఆరోగ్యవంతమైంది. దీన్ని ఈ సీజన్‌లో తాగితే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే చికెన్ సూప్‌ను మనం ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్‌లెస్ చికెన్ – పావుకిలో, పాలకూర తరుగు – 1 కప్పు, క్యారెట్ తరుగు – పావు కప్పు, చక్కెర – 1 టీస్పూన్, మిరియాల పొడి – చిటికెడు, ఉల్లికాడల తరుగు – 2 టీస్పూన్లు, బీన్స్ తరుగు – పావు కప్పు, వెల్లుల్లి తరుగు – 1 టీస్పూన్, పచ్చిమిర్చి తరుగు – 1 టీస్పూన్, కార్న్ ఫ్లోర్ – 1 టీస్పూన్, నూనె – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత.
చికెన్ సూప్ ను తయారు చేసే విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత చికెన్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడయ్యాక.. క్యారెట్, బీన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత చికెన్‌ను వేసి.. దాన్ని ఉడికించిన నీళ్లను పోసి చక్కెర, ఉప్పు, పాలకూర తరుగు, ఉల్లికాడల తరుగు, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. దీన్ని పది నిమిషాలు ఉడికించాలి. దీంతో చికెన్ సూప్ రెడీ అవుతుంది. దీన్ని వేడిగానే ఉండగానే తాగేయాలి. ఇది మనకు ఎంతో ఆరోగ్యకరమైనది. ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సీజన్‌లో తప్పక తాగాలి.