Cinnamon : మనం వంటింట్లో ఉపయోగించే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిని సంస్కృతంలో దారుశిల అని పిలుస్తారు. దాల్చిన చెక్క మొక్కలు ఎత్తైన కొండ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. మనం నాన్ వెజ్ వంటలను తయారు చేసేటప్పుడు పులావ్, చికెన్ బిర్యానీ వంటి వాటిని తయారు చేసేటప్పుడు దాల్చిన చెక్కను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. దాల్చిన చెక్కను వంటల్లో వేయడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.
దాల్చిన చెక్క చూర్ణం, యాలకుల చూర్ణం, బిర్యానీ ఆకు చూర్ణాన్ని సమపాలల్లో కలిపి నిల్వ చేసుకోవాలి. టీ ని తయారుచేసేటప్పుడు పావు టీ స్పూన్ చొప్పున ఈ మిశ్రమాన్ని వేసి బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న టీ ని తాగడం వల్ల నరాలు ఉత్తేజితమవుతాయి. మానసిక స్థితి మెరుగుపడుతుంది. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించి బరువును తగ్గించడంలోనూ దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ పావు టీ స్పూన్ చొప్పున దాల్చిన చెక్క చూర్ణాన్ని, తేనెతో కలిపి తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది. చర్మంపై ఉండే ముడతలు తొలగిపోతాయి.
రాత్రి భోజనం అనంతరం చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకుని నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇలా చప్పరించడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. దాల్చిన చెక్క యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరస్, యాంటీ ఫంగస్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడుతున్నప్పుడు చిటికెడు దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల వీటి నుండి ఉపశమనం లభిస్తుంది.
అతి మూత్ర వ్యాధి, మధుమేహం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటి అనారోగ్య సమస్యలను నివారించడంలో కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. బీపీని నియంత్రించడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కే కదా అని తేలికగా తీసుకోకుండా సరైన విధంగా ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.