Tomato Onion Curry : మనం వంటింట్లో చేసే ప్రతి వంటలోనూ ఉల్లిపాయలను వేస్తూ ఉంటాం. అలాగే టమాటాలను వేసి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. ఇవి రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. ఉల్లిపాయలను, టమాటాలను ఉపయోగించి వేరు వేరుగా కాకుండా ఒకే కూరగా చేయవచ్చు. ఈ కూరను తయారు చేయడం చాలా సులభం. ఇంట్లో ఇతర కూరగాయలు లేనప్పుడు లేదా కూరను తయారు చేసే సమయం లేనప్పుడు చాలా తక్కువ సమసయంలోనే చాలా రుచిగా ఇలా టమాటాను ఉల్లిపాయలను ఉపయోగించి మనం కూరను తయారు చేయవచ్చు. వీటిని ఉపయోగించి కూరను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట ఉల్లిపాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన టమాటాలు – 4 (పెద్దవి), తరిగిన ఉల్లిపాయలు – 2 (పెద్దవి), తరిగిన పచ్చి మిర్చి – 3, పసుపు – పావు టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, మినప పప్పు – పావు టీ స్పూన్, శనగ పప్పు – అర టీ స్పూన్, కారం – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 2 టీ స్పూన్స్, నీళ్లు – తగినన్ని.
టమాట ఉల్లిపాయ కూర తయారు చేసే విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి కాగిన తరువాత మినప పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు, పసుపు, పావు టీ స్పూన్ ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలను, రుచికి తగినంత మరి కొద్దిగా ఉప్పును వేసి కలిపి మూత పెట్టి టమాటాలను 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
5 నిమిషాల తరువాత మూత తీసి తగినన్ని నీళ్లను పోసి మూత పెట్టి టమాటాలను పూర్తిగా ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికిన తరువాత కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉంచి చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట ఉల్లిపాయ కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా టమాటాలు, ఉల్లిపాయలలో ఉండే పోషకాలను, వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.