గోధుమగడ్డిని మనం ఇండ్లలోనే పెంచుకోవచ్చు. గోధుమలను మొలకెత్తించి అనంతరం వాటిని నాటితే గోధుమగడ్డి కొద్ది రోజుల్లోనే పెరుగుతుంది. కొద్దిగా పెరగగానే లేతగా ఉండగానే ఆ గడ్డిని సేకరించి దాన్ని జ్యూస్‌లా చేసుకుని నిత్యం తాగాల్సి ఉంటుంది. అయితే గోధమగడ్డిని పెంచలేని వారికి గోధుమ గడ్డి జ్యూస్ లభిస్తుంది. దీంతోపాటు ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో దేన్నయినా ఉపయోగించవచ్చు. దీంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
సూపర్ ఫుడ్…
గోధుమగడ్డిని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఎందుకంటే దీంట్లో అనేక పోషకాలు ఉంటాయి. ఐరన్, కాల్షియం, ఎంజైమ్‌లు, మెగ్నిషియం, ఫైటో న్యూట్రియెంట్లు, 17 రకాల అమైనో యాసిడ్లు, విటమిన్‌లు ఎ, సి, ఇ, కె, బి కాంప్లెక్స్, క్లోరోఫిల్, ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల మన శరీరానికి సంపూర్ణ పోషణ కలుగుతుంది.
విష పదార్థాలు…
గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
జీర్ణ ప్రక్రియకు…
గోధుమగడ్డిలో అనేక ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడతాయి. అందువల్ల అజీర్ణ సమస్య ఉండదు. అలాగే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సులభంగా గ్రహించగలుగుతుంది. దీంతోపాటు గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.
మెటబాలిజం…
గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో శరీరం క్యాలరీలను వేగంగా ఖర్చు చేస్తుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. అధిక బరువు తగ్గాలని చూసే వారికి ఇది ఉత్తమ ఆహారంగా పనిచేస్తుంది.
కొలెస్ట్రాల్…
గోధుమ గడ్డి జ్యూస్‌ను నిత్యం తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) స్థాయిలు పెరుగుతాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
శరీర రోగ నిరోధక శక్తి…
గోధుమ గడ్డిలో ఉండే పోషకాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరానికి శక్తిని అందిస్తాయి. బీపీని తగ్గిస్తాయి. ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
ఇవే కాకుండా గోధుమ గడ్డి జ్యూస్‌ను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అయితే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు గోధుమ గడ్డి జ్యూస్‌ను తీసుకోరాదు. ఇక దీన్ని తీసుకున్నాక వికారం, తలనొప్పి, మలబద్దకం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ జ్యూస్‌ను తీసుకోవడం ఆపేయాలి. కొందరికి ఈ జ్యూస్ పడదు. అందువల్ల ఈ లక్షణాలు కనిపించిన వెంటనే జ్యూస్‌ను తీసుకోవడం మానేయాల్సి ఉంటుంది.
గోధుమ గడ్డి జ్యూస్‌ను నిత్యం 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవచ్చు. పొడి అయితే ఒక టీస్పూన్ పొడిని 250 ఎంఎల్ నీటిలో కలిపి తీసుకుంటే మంచిది. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు గోధుమ గడ్డిని వాడుకుంటే మంచిది.