దగ్గు అనేది సహజంగా ఎవరికైనా వస్తూనే ఉంటుంది. సీజన్లు మారినప్పుడు చేసే జలుబుతోపాటు దగ్గు వస్తుంది. ఇక కొందరికి అలర్జీలు, బాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా దగ్గు వస్తుంటుంది. అయితే దగ్గుకు ఇంగ్లిష్ మెడిసిన్ ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే దగ్గును తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె…
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 2 టీస్పూన్ల తేనె, 1 టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి తాగితే దగ్గు వెంటనే తగ్గుతుంది. లేదా హెర్బల్ టీలో తేనె కలిపి తాగినా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు దగ్గును వెంటనే తగ్గిస్తాయి.
ప్రొ బయోటిక్స్…
ప్రొ బయోటిక్స్ అనేవి చిన్నపాటి మైక్రో ఆర్గానిజంలు. అంటే మన శరీరాన్ని రక్షించే మంచి సూక్ష్మ జీవులు అని చెప్పవచ్చు. అయితే పాలు, పాల సంబంధ ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఈ ప్రొ బయోటిక్స్ పెరుగుతాయి. దీంతో శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పైనాపిల్…
దగ్గును సమర్థవంతంగా నివారించడంలో పైనాపిల్ బాగా పనిచేస్తుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. పైనాపిల్ పండ్లలో బ్రొమెలెయిన్ అనబడే ఎంజైమ్ ఉంటుంది. ఇది దగ్గును తగ్గిస్తుంది. దగ్గు బాగా ఉన్న వారు పైనాపిల్ ముక్కలు రెండింటిని తిని కొద్దిగా నీరు తాగాలి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
పుదీనా…
పుదీనా ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు సమస్యలను తగ్గిస్తాయి. మ్యూకస్‌ను కరిగించి శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పుదీనా ఆకులతో తయారు చేసే టీని తాగాలి. లేదా పుదీనా ఆకులను బాగా మరిగిన నీటిలో వేసి ఆ నీటిని ఆవిరిపట్టాలి. అలా కాకపోతే 3 లేదా 4 చుక్కల పుదీనా ఆయిల్‌ను గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగవచ్చు. దీంతో దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లం రసం…
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు సమస్యలను తగ్గిస్తాయి. అల్లం రసంను నేరుగా కొంత మోతాదులో తాగినా లేదా చిన్న అల్లం ముక్కను తింటున్నా లేదా అల్లం టీ తాగినా దగ్గు సమస్య తగ్గుతుంది.