పొడపత్రి మొక్క భారత్, ఆఫ్రికాతోపాటు ఆస్ట్రేలియాలో ఎక్కువగా పెరుగుతుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ మొక్క ఆకులను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. పొడపత్రి మొక్క ఆకుల చూర్ణాన్ని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తీపి పదార్థాలను, పిండి పదార్థాలను ఎక్కువగా తినేవారు, వాటిని తినాలనే యావ కలిగి ఉన్నవారు రోజూ పొడపత్రి చూర్ణం తీసుకుంటే మేలు జరుగుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఆయా పదార్థాలను తినాలనే యావ తగ్గుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.
2. మధుమేహాన్ని తగ్గించడంలో పొడపత్రి ఆకు అమోఘంగా పనిచేస్తుంది. పొడపత్రి చూర్ణం తీసుకుంటే షుగర్ తగ్గుతుంది. ఇందులో యాంటీ డయాబెటిస్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. షుగర్ ఉన్నవారు పొడపత్రి చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
3. డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో క్లోమ గ్రంథి పనిచేయదు. దీంతో వారు ఇన్సులిన్‌ను తీసుకోవాలి. కానీ టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. కానీ దాన్ని శరీరం సరిగ్గా గ్రహించదు. దీంతో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే పొడపత్రి ఆకు చూర్ణాన్ని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరుగుతుంది. అంటే క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. దీంతోపాటు ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
4. పొడపత్రి ఆకు చూర్ణాన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
5. అధిక బరువు తగ్గాలనుకునే వారు పొడపత్రి ఆకు చూర్ణాన్ని తీసుకోవాలి. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించేందుకు ఈ చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వాపులు తగ్గుతాయి.
పొడపత్రి ఆకు చూర్ణాన్ని రోజూ 4 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఆరంభంలో 2 గ్రాములు తీసుకోవాలి. తరువాత మోతాదు పెంచాలి. పొడపత్రి చూర్ణం క్యాప్సూల్స్ అయితే 100 ఎంజీ మోతాదు ఉన్నవి రోజుకు 3-4 సార్లు తీసుకోవచ్చు. ఈ ఆకులతో తయారు చేసిన టీని రోజుకు ఒకసారి తాగవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365