మన దేశంలో రోజూ ఎన్నో రకాల మసాలా దినుసులను చాలా మంది వాడుతుంటారు. వాటిల్లో అనాస పువ్వు ఒకటి. దీన్నే స్టార్ అనీస్ అంటారు. దీన్ని ఆయుర్వేదంలో అద్భుతమైన మసాలా దినుసుగా చెబుతారు. ఎందుకంటే ఇది అనే వ్యాధులను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. అందువల్ల అనాస పువ్వుతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అనాస పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. ఈ పువ్వులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు, విటమిన్ ఎ, సి లు దగ్గు, జలుబును తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తాయి. ఈ పువ్వులో షికిమిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆస్తమా, బ్రాంకైటిస్ సమస్యలను తగ్గిస్తుంది. అందువల్ల అనాస పువ్వు శ్వాస కోశ సమస్యలు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది.
2. అనాస పువ్వు తియ్యని సువాసనను కలిగి ఉంటుంది. అందువల్ల ఈ పువ్వు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. బీపీని తగ్గిస్తుంది. సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌గా కూడా పనిచేస్తుంది.
3. మార్కెట్లో మనకు స్టార్ అనీస్ ఎసెన్షియల్ ఆయిల్ లభిస్తుంది. దీన్ని రాయడం వల్ల వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఈ ఆయిల్‌తో రోజూ సంబంధిత భాగాల్లో మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది.
4. ఆయుర్వేద ప్రకారం అనాస పువ్వులో సెడేటివ్ గుణాలు ఉంటాయి. అంటే దీన్ని తీసుకుంటే నాడులు ప్రశాంతంగా మారుతాయి. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ నీటిలో రెండు అనాస పువ్వులు వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. దీంతో నిద్ర బాగా పడుతుంది.
5. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాని వారు, అజీర్ణం సమస్య ఇబ్బందులకు గురి చేస్తున్న వారు అనాస పువ్వును తీసుకోవాలి. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి.
6. ఫంగస్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలోనూ ఈ పువ్వు బాగానే పనిచేస్తుంది. దీన్ని కొద్దిగా నీటితో కలిపి పేస్ట్‌లా నూరి ఇన్ఫెక్షన్పై అప్లై చేయాలి. దీంతో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
7. ముఖంపై ఏర్పడే ముడతలు, మచ్చలను ఈ పువ్వు తగ్గిస్తుంది. అందుకు గాను ఈ పువ్వుకు చెందిన ఎసెన్షియల్ ఆయిల్‌ను వాడవచ్చు. ఈ నూనె రాస్తుంటే మొటిమలు, మచ్చలు పోతాయి. అలాగే జుట్టుకు రాస్తే జుట్టు బాగా పెరుగుతుంది. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
8. అనాస పువ్వు చూర్ణాన్ని తీసుకోవడం వల్ల స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. దీంతో శృంగార సామర్థ్యం పెరగడంతోపాటు సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.
అనాస పువ్వును అధిక మోతాదులో తీసుకుంటే విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక సమస్య ఉన్నప్పుడు కొద్ది మోతాదులో తీసుకోవాలి. పావు టీస్పూన్ అనాస పువ్వు చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేదా ఆయిల్‌ను పది చుక్కలు వాడవచ్చు. ఈ పువ్వును ఒకటి లేదా రెండు వేసి నీటిలో మరిగించి తాగవచ్చు. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.