Bay Leaf : మనం వంటింట్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో బిర్యానీ ఆకు కూడా ఒకటి. వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో మనం ఈ ఆకును ఉపయోగిస్తూ ఉంటాం. బిర్యానీ ఆకును ఉపయోగించడం వల్ల మనం తయారు చేసే వంటల సువాసన, రుచి పెరుగుతుంది. బిర్యానీ ఆకే కదా అని తేలికగా తీసుకోకూడదు. దీనిలో మన శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. ఈ ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, మాంగనీస్, కాల్షియం, మెగ్నిషియం వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.
క్యాన్సర్ కణాలను నశింపజేసే శక్తి కూడా బిర్యానీ ఆకులకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ బిర్యానీ ఆకులతో కషాయాన్ని చేసుకుని తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. బిర్యానీ ఆకులతో చేసిన కషాయాన్ని రెండు గ్లాసుల చొప్పున రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనం కలుగుతుంది. ఈ ఆకులతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

బిర్యానీ ఆకులతో చేసిన టీ ని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ టీ ని తాగడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. బిర్యానీ ఆకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. బిర్యానీ ఆకులతో చేసిన టీ ని తాగడం వల్ల శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గుతాయి. నెలసరి సమస్యలతో బాధపడే స్త్రీలు ఈ ఆకులతో చేసిన టీ ని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఈ టీ ని తాగడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గు ముఖం పడుతుంది.
తరచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడే వారు బిర్యానీ ఆకులతో చేసిన టీ ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి జబ్బుల బారిన పడకుండా ఉంటారు. ఈ టీ ని తాగడం వల్ల శరీరంలోని మలినాలతోపాటు చెడు కొవ్వు కూడా తొలగిపోయి సులభంగా బరువు తగ్గుతారు. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ టీ ని తాగడం వల్ల ఆయా సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా బిర్యానీ ఆకు వంటల రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలును చేకూరుస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.