మనలో కొందరికి రకరకాల కారణాల వల్ల అప్పుడప్పుడు అజీర్తి సమస్య వస్తుంటుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అయితే కొందరికి ఆహారం సరిగ్గానే జీర్ణమవుతుంది. కానీ ఆకలి వేయదు. అయితే ఇలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే దాంతో ఆకలి పెరుగుతుంది. ఆకలి వేయడం లేదని బాధపడేవారు ఈ చిట్కాలను పాటిస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
నిమ్మరసం
జీర్ణక్రియకు ఇది మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఆకలి లేని వారు ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె, ఉప్పు కలిపి తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది.
ఖర్జూరాలు
ఖర్జూరాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి తక్షణమే శక్తిని అందిస్తాయి. ఆకలి లేని వారు నాలుగైదు ఖర్జూరాలను తింటే ప్రయోజనం ఉంటుంది. నిత్యం తినడం వల్ల ఆకలి బాగా వేస్తుంది.
అల్లం
ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే 2 టీస్పూన్ల అల్లం రసం సేవించాలి. లేదా చిన్న అల్లం ముక్కను నేరుగా అలాగే నమిలి మింగవచ్చు. దీంతో ఆకలి బాగా పెరుగుతుంది.
దాల్చిన చెక్క
ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 టీస్పూన్ల తేనెలను కలిపి నిత్యం ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తీసుకుంటే ఆకలి బాగా పెరుగుతుంది.
మెంతులు
2 టీస్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ మెంతులను తీసి పరగడుపునే తినాలి. తరువాత ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల ఆకలి పెరుగుతుంది. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేశాక పెరుగులో మెంతుల పొడిని కలుపుకుని తినడం వల్ల కూడా ఆకలి పెరుగుతుంది.
ద్రాక్ష
రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం చేశాక ద్రాక్ష పండ్లను తినడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది.
జామ
రోజుకు రెండు పూటలా జామ పండ్లను తినడం వల్ల కూడా ఆకలి బాగా పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365