Bad Breath Causes And Home Remedies : నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు సహజంగానే నలుగురిలోనూ కలవలేకపోతుంటారు. నలుగురిలోకి వచ్చి మాట్లాడాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఇక ఎదురెదురుగా అయితే అసలు మాట్లాడలేకపోతుంటారు. అలాంటి సమయాల్లో వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యను చాలా మంది అనేక సందర్భాల్లో ఎదుర్కొనే ఉంటారు. నోటి దుర్వాసననే Halitosis అని కూడా అంటారు. ఇది ఉంటే గనక చాలా ఇబ్బందిగా ఉంటుంది. బయటికి వెళ్లి నలుగురితో కలవాలన్నా సందేహిస్తారు. అయితే నోట్లో దుర్వాసన వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.
నోటిని సరిగ్గా శుభ్ర పరచకపోవడం, పలు రకాల ఆహారాలను తీసుకోవడం, ఇతర అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల నోట్లో దుర్వాసన కలిగే బాక్టీరియా పెరిగిపోతుంది. దీంతో నోరు దుర్వాసన వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటిస్తే నోటి దుర్వాసన సమస్య నుంచి ఇట్టే బయట పడవచ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు 8 గ్లాసుల నీళ్లను తాగాలి..
చాలా మంది నీళ్లను సరిగ్గా తాగరు. నీళ్లను తాగకపోతే నోట్లో దుర్వాసనను కలిగించే బాక్టీరియా నిరంతరం రెట్టింపు అవుతుంది. దీంతో నోరు మరింత కంపు కొడుతుంది. కానీ నీళ్లను తాగితే ఆ బాక్టీరియా లోపలికి వెళ్తుంది. దీంతో జీర్ణాశయంలో ఉండే యాసిడ్లు ఆ బాక్టీరియాను చంపేస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. కనుక రోజూ తగినంత మోతాదులో నీళ్లను తాగాలి. ఇక సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి కనీసం రోజుకు 8 గ్లాసుల మేర అయినా నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీంతో నోరు ఆరోగ్యంగా ఉంటుంది.
రోజూ 2 సార్లు బ్రష్ చేయాలి..
కొందరు రోజుకు కేవలం ఒకసారి మాత్రమే బ్రష్ చేస్తారు. ఇలా చేయకూడదు. ఇది అసలు మంచి పద్ధతి కాదు. రాత్రి నిద్రకు ముందు కూడా ఒకసారి బ్రష్ చేయాలి. దీని వల్ల నోట్లో బాక్టీరియా శాతం తగ్గుతుంది. దీంతో నోటి దుర్వాసన సమస్య ఉండదు. అలాగే దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దంతాలు పుచ్చిపోకుండా చూసుకోవచ్చు. ఇక రెండు పూటలా బ్రష్ చేసినప్పుడు నాలుకపై టంగ్ క్లీనర్‌తోనూ శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల నాలుకపై కూడా బాక్టీరియా పేరుకుపోకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల నోటి సమస్యల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా నోటి దుర్వాసన తగ్గుతుంది.
ఈ మూలికలను నమలవచ్చు..
పలు రకాల మూలికలను నమలడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు. మూలికలు అంటే ఆయుర్వేద షాపుల్లో లభించేవి కావు, మన ఇంటి చుట్టు పక్కల సహజసిద్ధంగా లభించేవి. అంటే.. తులసి, కొత్తిమీర, పుదీనా అన్నమాట. వీటితోపాటు నోటి దుర్వాసనను తగ్గించడంలో యాలకులు, లవంగాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వీటన్నింటిలో ఏదో ఒకదాన్ని నోట్లో వేసుకుని నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్‌ను కూడా ఇందుకు వాడవచ్చు. దీన్ని నీటితో కలిపి నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా నోటి దుర్వాసనను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఇందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. దీంతో నోరు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.