Cracked Heels : మనలో చాలా మంది పాదాల పగుళ్లతో బాధపడుతూ ఉంటారు. ఈ పగుళ్ల వల్ల పాదాలు అంద విహీనంగా కనబడుతూ ఉంటాయి. పాదాల పగుళ్లను తగ్గించడానికి రకరకాల క్రీములను, ఆయింట్ మెంట్లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల పగుళ్లు తగ్గినా శాశ్వత పరిష్కారం లభించదు. అయితే ఎటువంటి ఆయింట్‌మెంట్లను వాడకుండా పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు. పాదాలను సరిగ్గా శుభ్రపరచక పోవడం వల్ల మలినాలు, మట్టి చేరి చర్మం గట్టి పడి పగుళ్లు ఏర్పడతాయి.ఇంట్లోనే సహజ సిద్దమైన పద్దతిలో మనం పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు.

పాదాల పగుళ్లు ఉన్న వారు పాదాలకు నూనె, ఆముదం లేదా నెయ్యిని రాసి వేడి నీటిలో 25 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత పాదాలను శుభ్రపరిచే రాళ్లను, బ్రష్ లను, లేదా గరుకుగా ఉండే వస్త్రాన్ని ఉపయోగించి పాదాలను శుభ్రపరుచుకోవాలి. దీంతోపాటు వీలైనంత వరకు చెప్పులను ధరించే ఉండాలి. సాక్స్ లను వేసుకునే వారు వాటిని ధరించే ముందు పాదాలకు కొద్దిగా నూనెను కానీ.. నెయ్యిని కానీ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మూడు నుంచి వారం రోజులలో పాదాల పగుళ్లు తగ్గుతాయి.
పాదాల పగుళ్లు తగ్గిన తరువాత అవి మళ్లీ రాకుండా ఉండడానికి స్నానం చేసే ముందు పాదాలకు నూనె లేదా నెయ్యిని రాసి స్నానం చేయాలి. స్నానం చివర్లో పాదాలను కూడా రాళ్లు లేదా బ్రష్ సహాయంతో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల పాదాల పగుళ్లు రాకుండా ఉంటాయి. దీనితోపాటు నీళ్లను కూడా అధికంగా తీసుకోవాలి. మన శరీరంలో పాదాలు చివరి భాగంలో ఉంటాయి. పాదాలకు రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. నీళ్లను అధికంగా తాగడం వల్ల రక్త ప్రసరణ ఎక్కువగా జరిగి పాదాలలో చర్మం గట్టి పడకుండా, పగుళ్లు రాకుండా ఉంటాయి. తరుచూ పాదాలను శుభ్రపరుచుకుంటూ, నీటిని అధికంగా తాగడం వల్ల పాదాల పగుళ్లు రాకుండా, పాదాలు అందంగా మారుతాయి.