Cough Remedies : ఈ రోజుల్లో చాలా మందిని చాలా సందర్భాల్లో వేధిస్తున్న సమస్య దగ్గు. వాస్తవానికి ఈ దగ్గు చాలా కొద్ది రోజులు ఉండి పోయే సమస్య. కానీ కొందరిలో ఎడతెరిపి లేకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎలర్జీలు, ఇన్ఫెక్షన్ లు, చల్లగాలి, దుమ్ము, ధూళి, పరిశ్రమల నుండి వచ్చే దుమ్ము వంటివి ఈ దగ్గుకు కారణం కావచ్చు. వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పెడుతున్న ఈ దగ్గు నుండి ఎలా విముక్తి చెందాలో ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గును మనందరం ఒక సమస్యగా భావిస్తాం కానీ వాస్తవానికి దగ్గు అనేది మన శరీరారినిక సంబంధించిన కీలకమైన రక్షణ ఏర్పాటు. హానికర పదార్థాలు కానీ, రేణువులు కానీ, సూక్ష్మ క్రిములు కానీ లోనికి వెలుతుంటే బయటకు నెట్టేస్తుంది.
అలాగే శ్వాస వ్యవస్థలో ఏర్పడే తెమడ, స్రావాలను బయటకు పంపించడంలో దగ్గు సహాయపడుతుంది. దగ్గు ఎందుకు వస్తుందో ముందుగా తెలుసుకుంటే దానిని నివారించడం సులభం అవుతుంది. ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుంది అంటే శరీరం తీవ్రమైన అనారోగ్యం బారిన పడబోతుందిగా భావించాలి. మానసికపరమైన కారణాల వల్ల కూడా దగ్గు వేధిస్తుంది. జలుబు చేసినప్పుడు , ఫ్లూ జ్వరం బారిన పడినప్పుడు పొడి దగ్గు ఎక్కువగా వస్తుంది. హైబీపీ వంటి సమస్యలకు వాడే మందుల వల్ల కూడా దగ్గు వస్తుంది. చిన్న పిల్లల్లో దగ్గు కనిపించినప్పుడు తేనె వాడడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ ల వల్ల కూడా దగ్గు వస్తుంది. ఈ కారణంగా వచ్చే దగ్గును తగ్గించడంలో ఉప్పు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటిలో ఉప్పు వేసి కరిగించి ఆ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల దగ్గు తగ్గుతుంది.
ఈ చిట్కాను ఆహారం తీసుకోవడానికి ముందు పాటించాలి. తులసి ఆకులను, అల్లం ముక్కలను నీటిలో వేసి కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల కూడా దగ్గు తగ్గుతుంది. అలాగే వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం వల్ల కూడా దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. మసాలా ఎక్కువగా తీసుకున్నప్పుడు కడుపులో తయారయిన యాసిడ్ ల వల్ల కూడా దగ్గు వస్తుంది. అలర్జీల వల్ల దగ్గు వచ్చే వారు దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి వాటికి దూరంగా ఉండాలి. రాత్రి పూట తలగడ ఎత్తుగా పెట్టుకోవాలి. నిద్రపోవడానికి ముందు వేడి నేటిలో తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న చిట్కాలను వాడినప్పటికి దగ్గు తగ్గకపోతే వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.