Ear Cleaning : చెవుల్లో గులిమి పేరుకుపోవడం అన్నది సర్వ సాధారణంగా జరిగే విషయమే. ప్రతి ఒక్కరికీ ఇలాగే జరుగుతుంటుంది. అయితే కొందరికి గులిమి మరీ ఎక్కువగా తయారై ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. ఈ క్రమంలోనే చెవుల్లో మాటిమాటికీ దురదగా అనిపిస్తుంటుంది. అయితే అలాంటి వారు కాటన్ బడ్స్ తో గులిమి తీస్తుంటారు. కానీ వాటికి బదులుగా కింద తెలిపిన సహజసిద్ధమైన చిట్కాలను పాటించవచ్చు. దీంతో గులిమిని సురక్షితంగా బయటకు తీయవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
ఒక చిన్న గ్లాస్‌లో 60 ఎంఎల్ మోతాదులో గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. అందులో అర టీస్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలపాలి. తరువాత డ్రాపర్ సహాయంతో ఒక్కో చెవిలో 5 నుంచి 10 చుక్కలు ఆ మిశ్రమాన్ని వేయాలి. అనంతరం ఒక గంట సేపు అయ్యాక శుభ్రమైన నీళ్లతో చెవులను కడిగేయాలి. ఇలా 2 రోజులకు ఒకసారి చేయాలి. చెవి మొత్తం శుభ్రం అయిందని అనుకునే వరకు 2 రోజులకు ఒకసారి ఇలా చేయవచ్చు. అయితే 4 సార్లు ఈ విధంగా ప్రయత్నించవచ్చు. అంతకన్నా ఎక్కువ సార్లు ఈ చిట్కాను ట్రై చేయకూడదు. అవసరం అనుకుంటే డాక్టర్‌ను సంప్రదించాలి.
ఇక బేకింగ్ సోడాకు బదులుగా కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెను వాడవచ్చు. ఏదైనా ఒక నూనె తీసుకుని 5 నుంచి 10 చుక్కలను ఒక్కో చెవిలోనూ వేయాలి. ఒక గంట సేపు అయ్యాక కడిగేయాలి. ఈ చిట్కాను రోజూ.. ఎన్ని రోజుల వరకైనా పాటించవచ్చు. ఇది సురక్షితమైన పద్ధతి.
అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ మిశ్రమాన్ని కూడా చెవులను క్లీన్ చేసేందుకు వాడవచ్చు. ఈ మిశ్రమాన్ని కూడా 5 నుంచి 10 చుక్కల మోతాదులో ఒక్కో చెవిలోనూ వేయాలి. కానీ కేవలం 5 నిమిషాలే ఉంచాలి. తరువాత కడిగేయాలి. ఇలా 14 రోజుల్లో 3 సార్లు చేయవచ్చు. దీంతో చెవుల్లోని గులిమి పోతుంది. చెవులు శుభ్రమవుతాయి. చెవుల్లో ఉండే దురద తగ్గుతుంది.