Flax Seeds : ప్రస్తుత తరుణంలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధికంగా పిండి పదార్థాలు ఉండే ఆహారాలను తినడం, మాంసాహారం, జంక్ ఫుడ్, నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ సమయం పాటు కూర్చుని ఉండడం, అధిక బరువు.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి మలబద్దకం సమస్య వస్తోంది. అయితే ఇందుకు అవిసె గింజలు ఉత్తమమైన పరిష్కారం చూపుతాయని చెప్పవచ్చు.
అవిసె గింజల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే ఈ గింజల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, మెగ్నిషియం, పొటాషియం మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.
అవిసె గింజల్లో ఉండే పోషకాలతో అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట, నొప్పి సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. అలాగే మలబద్దకం నుంచి బయట పడవచ్చు. సుఖంగా విరేచనం అవుతుంది.
మలబద్దకం తగ్గేందుకు అవిసె గింజలను పలు రకాలుగా తీసుకోవచ్చు. గుప్పెడు అవిసె గింజలను పెనంపై కొద్దిగా వేయించాలి. అనంతరం వాటిపై కాస్త ఉప్పు చల్లి తినాలి. వీటిని సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలో తినవచ్చు.
రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అవిసె గింజల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో కలపాలి. అనంతరం ఆ నీటిని తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే మలబద్దకం అన్న సమస్యే ఉండదు. ఇక రాత్రి తినే ఆహారంపై అవిసె గింజల పొడిని చల్లి కూడా తినవచ్చు. ఈ విధంగా ఈ గింజలను తీసుకుంటే ఎలాంటి జీర్ణ సమస్య ఉండదు.
అయితే అవిసె గింజలను రోజూ స్వల్ప పరిమాణంలోనే తీసుకోవాలి. ఎక్కువైతే శరీరంలో వేడి పెరిగి విరేచనాలు అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక వీటిని మోతాదులోనే తినాలి.