Ear Wax : మన శరీరం వివిధ భాగాల నుండి వ్యర్థాలను బయటకు పంపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే చెవి నుండి వచ్చే వ్యర్థాలనే గులిమి అంటారు. చెవిలో గులిమి ఉండడం వల్ల గాలిలో ఉండే వైరస్ లు, బాక్టీరియాలు చెవి నుండి శరీరంలోకి ప్రవేశించకుండా ఉంటాయి. కానీ ఇది కొంత మోతాదులో మాత్రమే ఉండాలి. చెవిలో గులిమిని తరుచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయక పోవడం వల్ల గులిమి గట్టి పడి చెవి నొప్పి, వినికిడి లోపం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కొందరు చెవిలో గులిమిని శుభ్రం చేయడానికి సేఫ్టీ పిన్స్, పదునైన వస్తువులు, పుల్లలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కర్ణ భేరి దెబ్బతినే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని వాడడం వల్ల చెవిలో ఇన్ ఫెక్షన్స్ లేదా కర్ణ భేరి దెబ్బ తిని పూర్తిగా చెవుడు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
చెవిలో గులిమి గట్టిపడిన స్థితిలో ఉన్న వారు దానిని తొలగించడానికి నీటిలో ఉప్పు వేసి కరిగించి ఆ నీటి చుక్కలను చెవిలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గులిమి మెత్తబడుతుంది . తరువాత దీనిని ఇయర్ బడ్స్ సహాయంతో శుభ్రం చేయాలి. గులిమిని శుభ్రం చేయడానికి ఉప్పు నీటికి బదులుగా మినరల్ ఆయిల్ ను లేదా బేబీ ఆయిల్ ను కూడా వాడవచ్చు. ఇలా చేయడం వల్ల చెవిలో గట్టి పడిన గులిమిని సులువుగా తొలగించుకోవచ్చు.