Cold And Cough : ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నడుస్తోంది. దీని వల్ల చాలా మంది ఇప్పటికే సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ సీజన్ ఇంకో రెండు నెలల వరకు ఉంటుంది. కనుక ఈ సమయంలో మనం ఆరోగ్యం, ఆహారం విషయంలో జాగ్రత్తలను పాటించాలి. లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడతాం. మనకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యను అయినా సులభంగా తగ్గించుకోవచ్చు. ఇక ఈ సీజన్‌లో చాలా మందికి దగ్గు, జలుబు వస్తుంటాయి. అలాంటి వారు కింద తెలిపిన విధంగా పలు చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక దగ్గు, జలుబులను తగ్గించే పవర్‌ఫుల్ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక టీస్పూన్ తేనెలో అంతే మోతాదులో అల్లం రసం కలిపి రోజుకు మూడు పూటలా తాగుతుండాలి. ఈ రెండింటిలో ఉండే శక్తివంతమైన యాంటీ వైరల్ గుణాలు దగ్గు, జలుబులను తగ్గిస్తాయి. వాటి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
ఒక టీస్పూన్ తేనెలో పావు టీస్పూన్ మిరియాల పొడిని కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. దీంతో కూడా దగ్గు, జలుబు తగ్గుతాయి.
ఒక గ్లాస్ నీటిలో చిన్న అల్లం ముక్క, కాస్త చక్కెర వేసి కలిపి మరిగించాలి. నీరు సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించి అనంతరం ఆ మిశ్రమాన్ని వడకట్టి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది.
మిరియాలు అర టీస్పూన్, ధనియాలు ఒక టీస్పూన్ తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి సగం గ్లాస్ అయ్యాక వచ్చే మిశ్రమాన్ని వడకట్టి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.