Ginger : అల్లం.. ఇది తెలియని వారు అలాగే అల్లం లేని వంటగది ఉండదనే చెప్పవచ్చు. మనం చేసే ప్రతి వంటకంలోనూ అల్లాన్ని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లో అలాన్ని వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదే విధంగా అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని మనందరికి తెలిసిందే. అల్లాన్ని ఆల్ పర్పస్ మెడిసిన్ గా వైద్యులు అభివర్ణిస్తూ ఉంటారు. అల్లాన్ని ఉపయోగించడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అల్లాన్ని ఉపయోగించడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అలాగే దీనిని ఎలా ఉపయోగించాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం యొక్క శాస్త్రీయ నామం జింజిబర్ అపిషనేల్. దీనిని హిందీలో ఆదరక్ అని, సంస్కృతంలో ఆర్థకం అనే పేరుతో పిలుస్తారు.
అల్లంలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. కఫాన్ని తగ్గించడంలో అల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్లాన్ని ఆహార ఔషధంగా తీసుకోవడం వల్ల కఫం తగ్గుతుంది. అలాగే కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడే వారు అల్లాన్ని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అల్లాన్ని మెత్తగా దంచి నొప్పులు ఉన్న చోట రాసి దానిపై నుండి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి అందులో అల్లం తరుగును వేసి మూత పెట్టాలి. పది నిమిషాల తరువాత ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇలా అల్లం టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

మనకు ప్రస్తుత కాలంలో చాలా మంది కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, పైత్యం, వాంతులు, అజీర్తి వంటి వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇటువంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో అల్లం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ అల్లం రసం, రెండు టీ స్పూన్ ల నూనె, అర టీ స్పూన్ తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని లోనికి తీసుకోవడం వల్ల వికారం, వాంతులతో పాటు వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. అలాగే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కామెర్లను తగ్గించడంలో కూడా అల్లం సహాయపడుతుంది. అదే విధంగా అల్లాన్ని, బెల్లాన్ని సమపాళ్లల్లో తీసుకుని మెత్తగా దంచి తినాలి. ఇలా తినడం వల్ల అజీర్తి, అరుచి వంటి సమస్యలు తగ్గుతాయి. ఆకలి పెరుగుతుంది. అలాగే కొందరిలో ఎటువంటి సమస్యలేకపోయినా శరీరమంతా నీరు పడుతుంది.
అలాంటి వారు అల్లం, బెల్లం కలిపి దంచిన మిశ్రమాన్ని అర టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు నీటిలో కచ్చా పచ్చాగా దంచిన అల్లాన్ని వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి దీనికి కొద్దిగా ఉప్పు కలిపి తాగాలి. అదే విధంగా పరగడుపున అల్లం రసం, తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాటే టిబి, బ్రాంకైటిస్, ఆస్థమా, కోరింత దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారు అల్లం రసంలో, తేనె కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తాజాగా తయారు చేసిన అల్లం రసానికి, సమానంగా తేనెను కలిపి తీసుకోవాలి. అలాగే వీటితో పాటు ఉడికించిన కోడిగుడ్డును తినాలి. ఇలా తీసుకోవడం వల్ల నరాల నీరసం తగ్గుతుంది. పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
అదే విధంగా అల్లం రసంలో పంచదార కలిపి మూడు పూటలా తీసుకోవడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది. అలాగే అల్లాన్ని ఉపయోగించి తలనొప్పి, పంటి నొప్పి, చెవి నొప్పి వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అల్లం రసాన్ని గోరు వెచ్చగా చేసి రెండు లేదా మూడు చుక్కల మోతాదులో చెవిలో వేసుకోవడం వల్ల చెవి నొప్పి తగ్గుతుంది. అల్లాగే అల్లం రసంలో దూదిని ముంచి పంటి నొప్పి ఉన్న దంతం పై ఉంచి వత్తి పట్టాలి. ఇలా చేయడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. అలాగే తలనొప్పి నుండి బయట పడడానికి మనం అల్లంతో తయారు చేసే శొంఠిని ఉపయోగించాల్సి ఉంటుంది. శొంఠిని నీటితో కలిపి మెత్తగా నూరాలి. తరువాత దీనిని కాటన్ వస్త్రానికి బాగా రాసి నుదుటిపై పట్టీలా వేసుకోవాలి. ఈ విధంగా అల్లం మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.