Dandruff : నేటి తరుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. అనేక కారణాల వల్ల ఇది వస్తుంది. ముఖ్యంగా కొందరికి అయితే చుండ్రు బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే చుండ్రును తగ్గించుకోవడం కోసం అనేక మంది రక రకాల పద్ధతులను ట్రై చేస్తుంటారు. వాటిల్లో చాలా వరకు కృత్రిమమైనవే ఉంటాయి. దీంతో ఆ పద్ధతుల్లో వాడే షాంపూలు, ఇతర క్రీముల వల్ల వాటిల్లో ఉండే కెమికల్స్ జుట్టుకు మరింత హాని కలిగిస్తాయి. కనుక అలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కింద చెప్పిన పలు సహజ సిద్ధమైన పద్ధతులను ట్రై చేయండి. దీంతో చుండ్రును మరింత ఎఫెక్టివ్‌గా వదిలించుకోవచ్చు. మరి చుండ్రు పోవాలంటే పాటించాల్సిన ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
ఒక పాత్రలో 50 ఎంఎల్ మోతాదులో కొబ్బరి నూనె తీసుకోవాలి. అందులో నాలుగైదు వేపాకులు వేసి ఆ ఆయిల్‌ను కొద్దిగా మరగబెట్టాలి. అనంతరం దాన్ని అలాగే తీసుకుని గోరు వెచ్చగా ఉండగానే తలకు అప్లై చేసి 30 నిమిషాల వరకు వేచి ఉండి ఆ తరువాత యథావిధిగా తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు బాధ నుంచి విముక్తి కలుగుతుంది. వారంలో కనీసం 3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ మెంతులను తీసి పేస్ట్‌గా చేసి తలకు పట్టించాలి. 15 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు నుంచి విముక్తి కలుగుతుంది. అయితే మెంతుల పేస్ట్‌లో కొద్దిగా ఉసిరికాయ పొడి కూడా కలుపుకోవచ్చు. దీంతో మరింత ఎఫెక్టివ్‌గా ఫలితం వస్తుంది.
రైజిన్లు, బాదంపప్పును తీసుకుని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని తినాలి. ఇలా రోజూ చేస్తే చుండ్రు బాధ ఉండదు. శిరోజాలు కూడా ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ధనియాలు, సోంపు, తులసి ఆకులు, పసుపు, ఉసిరికాయ పొడిలను సమాన భాగాల్లో తీసుకుని మిశ్రమంగా చేయాలి. దీన్ని మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు 1 టేబుల్ స్పూన్ మోతాదులో సేవిస్తే చుండ్రు బాధ నుంచి తప్పించుకోవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపున 1 టీస్పూన్ ఉసిరికాయ పొడిని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగినా చుండ్రు నుంచి విముక్తి పొందవచ్చు. కొత్తిమీర జ్యూస్‌లో చిటికెడు పసుపు కలిపి రోజూ రెండు పూటలా తాగితే చుండ్రు తగ్గుతుంది.