Liver Detox Remedies : మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. దాదాపు మన శరీరంలో 500 కు పైగా విధులను కాలేయం నిర్వర్తిస్తుంది. శరీరానికి అవసరమయ్యే రసాయనాలను విడుదల చేయడంలో, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మద్యపానం, మందులను వాడడం వల్ల శరీరంలో చేరిన విష పదార్థాలను కూడా కాలేయం బయటకు పంపిస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కాలేయం సక్రమంగా పని చేయకపోతే మనం అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కాలేయం దెబ్బ తినడానికి అనేక కారణాలు ఉన్నాయి. మద్యపానం, ధూమపానం, ఒత్తిడి, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే మందులు వాడడం వంటి అనేక విషయాలు మన కాలేయ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి.
కాలేయ ఆరోగ్యం దెబ్బతింటే మన శరీర జీవక్రియలన్నీ కూడా దెబ్బ తింటాయి. కాలేయాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనం ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా జీవించవచ్చు. కాలేయంలోని మలినాలను తొలగించి కాలేయాన్ని శుభ్రపరచడంతో పాటు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని రకాల డిటాక్స్ పానీయాల గురించి అలాగే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయాన్ని శుభ్రపరచడంలో సొరకాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సొరకాయలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు, విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు ఎన్నో ఉన్నాయి. సొరకాయ సులువుగా జీర్ణమవ్వడంతో పాటు శరీరానికి చలువ కూడా చేస్తుంది.

ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక సొరకాయ ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో గుప్పెడు కొత్తిమీరను, తగినన్ని నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ నీటిలో పావు టీ స్పూన్ పసుపును, అరచెక్క నిమ్మరసాన్ని వేసి కలపాలి. తరువాత ఇందులో బ్లాక్ సాల్ట్ లేదా రాళ్ల ఉప్పును తగినంత వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉదయం అల్పాహారం తీసుకున్న అరగంట తరువాత తాగాలి.
అలాగే ఈ పానీయాన్ని తాగిన గంట వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇలా సొరకాయతో చేసిన పానీయాన్ని మూడు రోజుల పాటు క్ర మం తప్పకుండా తీసుకోవాలి. ఈ విధంగా సొరకాయతో చేసిన జ్యూస్ ను తాగడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మలినాలన్నీ తొలగిపోతాయి. అలాగే 10 ఎండు ద్రాక్షను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజూ మొత్తంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల కూడా కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. ఈ చిట్కాలను పాటిస్తూనే రోజూ గ్రీన్ టీ ని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అదే విధంగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఆపిల్ సైడ్ వెనిగర్ ను వేసి కలిపి తాగాలి.
ఆపిల్ పైడ్ వెనిగర్ కూడా కాలేయాన్ని శుభ్రపరచడంలో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిని తీసుకుంటూనే తాజా ఆకుకూరలు, కూరగాయలను రోజూ వారి ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అలాగే వారినికి రెండు సార్లు పాలకూరను, బీట్ రూట్ ను ఆహారంగా తీసుకోవాలి. అదే విధంగా విటమిన్ సి ఎక్కువగా పండ్లను తీసుకోవాలి. ఈ చిట్కాలను పాటిస్తూ చక్కటి జీవన విధానాన్ని పాటించడం వల్ల కాలేయం శుభ్రపడి కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మనం ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పగకుండా ఉంటాము.