Diarrhea : సాధారణంగా మన శరీరంలోని ద్రవాలను కోల్పోయేలా చేసి డీ హైడ్రేషన్ కి గురి చేయడం డయేరియా యొక్క మొదటి లక్షణం. నీళ్ల విరేచనాలు, వికారం, తిమ్మిర్లు, జ్వరం, వాంతులు, లూజ్ మోషన్స్ ఇంకా తరచూ విరేచనానికి వెళ్లవలసి రావడం లాంటివి దీని వలన కలిగే ఇతర సమస్యలు. మామూలుగా మన ఆహార నాళం, జీర్ణాశయం లేదా పెద్ద ప్రేగు లో ఇన్ఫెక్షన్ వలన డయేరియాకి గురయ్యే అవకాశం ఉంటుంది. వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్ లు ఇంకా పరాన్నజీవుల వలన కూడా డయేరియా రావడానికి అవకాశం ఉంటుంది.
అయితే ఇది ఒకటి లేదా రెండు రోజుల కంటే ఎక్కువ బాధించదు, ఒకవేళ అలా జరిగినప్పుడు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ డయేరియా సమస్య నుండి బయటపడడానికి కొన్ని రకాల యాంటీ బయోటిక్స్ ఇంకా మందులు ఉపయోగపడతాయి. కానీ మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో డయేరియాను సులువుగా నివారించవచ్చు. అవి ఈ సమస్యపై ఎంతో ప్రభావం చూపించడంతోపాటు సురక్షితమైనవి కూడా. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అల్లం టీ అనేది డయేరియాను తగ్గించడంలో ప్రభావవంతమైన సహజ సిద్ధ గుణాలను కలిగి ఉంటుంది. జీర్ణక్రియలో ఇబ్బందులు, కడుపు ఉబ్బరం, వికారం లాంటి సమస్యలను తొలగిస్తుంది. ఇంకా చామంతి టీ లో ఉండే చల్లబరిచే గుణాల వలన జీర్ణ ప్రక్రియను సరి చేసి విరేచనాలను అదుపుచేయడంలో సహాయ పడుతుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉన్న యాంటీ సెప్టిక్ గుణాలు.. వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్ ఇంకా ఇన్ఫెక్షన్లలను నిర్మూలించడానికి ఉపయోగపడుతాయి. దీని వలన డయేరియా కూడా అదుపులోకి వస్తుంది.
కానీ యాపిల్ సైడర్ వెనిగర్ ను పరిమితికి మించి తీసుకోకూడదు. అలా తీసుకున్నప్పుడు అది హానికారకం అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మెంతులు, క్యారెట్ లను కూడా డయేరియా నుండి విముక్తి పొందడానికి ఉపయోగించవచ్చు. మెంతులలో ఉండే మ్యుసిలేజ్ అనే పదార్థం డయేరియాతో పోరాడుతుంది. ఇక క్యారెట్ ను జ్యూస్ లేదా సూప్ రూపంలో తీసుకోవచ్చు. దీనిలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి డయేరియాను దూరం చేయడంలో తోడ్పడుతాయి. ఈ విధంగా మన ఇంట్లో సులువుగా లభించే పదార్థాలతో సురక్షితంగా డయేరియా వలన కలిగే ఇబ్బందుల నుండి బయట పడవచ్చు.