Patika Bellam With Milk : మనలో చాలా మంది వెన్ను నొప్పితో బాధపడుతూ ఉంటారు. వెన్ను నొప్పి కారణంగా తలెత్తే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. వెన్ను నొప్పి కారణంగా మనం ఎక్కువ సేపు కూర్చోలేము. సరిగ్గా నడవలేము. వెన్ను నొప్పి తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ సేపు కూర్చోవడం అలాగే సరైన భంగిమలో కూర్చోకపోవడం, ఇష్టం వచ్చినట్టు బరువులు ఎత్తడం, పోషకాహార లోపం, సరైన భంగిమలో నిద్రించకపోవడం వంటి వివిధ కారణాల చేత వెన్నునొప్పి వస్తూ ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ వెన్ను నొప్పి అందరిని బాధిస్తుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి పెయిన్ కిల్లర్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల సమస్య తగ్గినప్పటికి వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల అనేక దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుంది.
కనుక ఈ సమస్యలను మనం వీలైనంత వరకు సహజసిద్దంగా తగ్గించుకోవడమే ఉత్తమం. వెన్నునొప్పిని తగ్గించడంలో మనకు మెంతులు ఎంతగానో సహాయపడతాయి. మెంతుల్లో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. నొప్పులను, వాపులను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా మెంతుల్లో ఉండే లినోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లల్లో, వెన్నులో నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. వెన్ను నొప్పితో బాధపడే వారు రోజూరాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ మెంతులను ఒక గ్లాస్ నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని మెంతులతో సహా ఒక గిన్నెలో పోసి వేడి చేయాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.
తరువాత మెంతులను బాగా నమిలి తిని నీటిని తాగాలి. అయితే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోకూడదు. ఈ విధంగా మెంతులను తీసుకోవడం వల్ల వెన్ను నొప్పితో పాటు శరీరంలో ఉండే ఇతర కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే వెన్ను నొప్పితో బాధపడే వారు గసగసాలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. 50 గ్రాముల గసగసాలను, 50 గ్రాముల పటిక బెల్లాన్ని కలిపి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో రెండు స్పూన్ల మోతాదులో కలిపి తీసుకోవాలి. ఇలా వారంలో మూడు సార్లు తీసుకోవడం వల్ల కూడా వెన్నునొప్పితో పాటు ఇతర నొప్పులు కూడా తగ్గుతాయి.
అలాగే ఆలివ్ ఆయిల్, నీలగిరి తైలం, బాదం నూనె వంటి వాటితో వెన్ను నొప్పి ఉన్న చోట మర్దనా చేసుకోవాలి. వీటిలో ఏదో ఒక నూనెను తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి అవి నల్లగా అయ్యే వరకు నూనెను వేడి చేయాలి. తరువాత ఈ నూనె గోరు వెచ్చగా అయిన తరువాత దానితో సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా వెన్ను నొప్పితో శరీరంలో నొప్పులను, వాపులను కూడా తగ్గించుకోవచ్చు.