Pimples Home Remedies : మనల్ని వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. మొటిమలు, మొటిమల వల్ల కలిగే మచ్చలు మనల్ని ఇబ్బందిపెడుతూ ఉంటాయి. మొటిమలను తగ్గించుకోవడానికి మార్కెట్ లో దొరికే ఆయింట్ మొంట్ లను, క్రీములను వాడుతూ ఉంటారు. ముఖం పై వచ్చే మొటిమలను మనం సహజ సిద్దంగా కూడా తగ్గించుకోవచ్చు. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా మొటిమల సమస్య నుండి బయట పడవచ్చు. మొటిమలను తగ్గించే కొన్ని సహజ సిద్ద పద్దతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలు తగ్గాలన్నా అదే విధంగా ఈ సమస్య బారిన మనం పడకుండా ఉండాలన్నా ఈ చిట్కాలను పాటించడం చాలా అవసరం. మొటిమల సమస్యతో బాధపడే వారు రోజుకు కనీసం 4 లీటర్ల నీళ్లు తాగాలి. రెండు సార్లు మల విసర్జనకు వెళ్లాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలు, హానికర పదార్థాలు, మనం తీసుకునే జంక్ ఫుడ్ లో ఉండే రసాయనాలు బయటకు వెళ్లిపోతాయి. నీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవడంతో పాటు మొటిమలకు కారణమయ్యే వ్యర్థాలు కూడా తొలిగిపోతాయి. అలాగే ముఖానికి కొబ్బరి నూనెను కానీ పాల మీద మీగడను కానీ రాయాలి. ఇలా రాసిన తరువాత ఫేషియల్ స్టీమర్ తో ముఖానికి ఆవిరి పట్టుకోవాలి.
ఇలా చేయడం వల్ల మొటిమలకు కారణమయ్యే వ్యర్థ పదార్థాలు చర్మ రంధ్రాల నుండి చెమల రూపంలో బయటకు వస్తాయి. ఇలా ప్రతిరోజూ ముఖానికి నూనె కానీ మీగడ కానీ రాసుకుని ఆవిరి పట్టుకోవడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది. మొటిమల వల్ల వచ్చే మచ్చలను తగ్గించడంలో మడ్ ఫేస్ ఫ్యాక్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పొలాల్లో ఉండే నల్లటి మట్టిని ఈ ఫేస్ ఫ్యాక్ కు ఉపయోగించాలి. పై భాగంలో ఉండే మట్టిని తీసేసి అర అడుగు లోపలిరి తవ్వి మట్టిని సేకరించాలి. ఈ మట్టిని ఉండలు లేకుండా నలగొట్టి జల్లించాలి. ఇలా జల్లించగా వచ్చిన మెత్తటి మట్టికి నీటిని కలిపి 4 గంటల పాటు నానబెట్టాలి. ఇలా తయారు చేసుకున్న మట్టికి కొద్దిగా పసుపును కలిపి ముఖానికి ఫ్యాక్ లా వేసుకోవాలి. ఈ మట్టి ఆరిన తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ముఖ చర్మానికి రక్తప్రసరణ బాగా జరిగి ముఖం పై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.
అదే విధంగా మొటిమల సమస్యతో బాధపడే వారు రోజూ ఉదయం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ కు తేనె, నిమ్మరసం కలుపుకొని తాగాలి. అదే విధంగా సాయంత్రం ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ లేదా బత్తాయి జ్యూస్ ను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కూడా మొటిమలు మరియు వాటి వల్ల వచ్చే మచ్చలు తగ్గుతాయి. అదే విధంగా మొటిమలను గిళ్ల కూడదు. పిండకూడదు. అలాగే ముఖం శుభ్రం చేసుకునేటప్పుడు వాటిపై గట్టిగా రుద్దకూడదు. కాటన్ వస్త్రంతో లేదా దూదితో నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయి.