Atukula Chuduva Recipe : సాధారణంగా చాలా మంది స్నాక్స్ రూపంలో రకరకాల ఆహారాలను తింటుంటారు. వాటిల్లో అటుకులు కూడా ఒకటి. పేపర్ అటుకులతో చేసే చుడువా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని బయట షాపుల్లో కొంటారు. కానీ కాస్త శ్రమిస్తే ఇంట్లోనే మనం ఎంతో రుచిగా ఉండే చుడువాను తయారు చేసుకోవచ్చు. ఇది కూడా బయట లభించేలా రుచిని కలిగి ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా ఎంతో సులభం. పేపర్ అటుకులతో చుడువాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకులతో చుడువా తయారీకి కావల్సిన పదార్థాలు..
పేపర్ అటుకులు – అర కిలో, వేరుశనగ, పుట్నాల పప్పులు – అర కప్పు చొప్పున, జీలకర్ర, ఆవాలు – ఒక టీస్పూన్ చొప్పున, కారం, పసుపు – అర టీస్పూన్ చొప్పున, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – ఆరు, వెల్లుల్లి తురుము – ఒక టీస్పూన్, ఎండు మిర్చి – 3, పచ్చి మిర్చి చీలికలు – ఆరు, కరివేపాకు – 1 రెబ్బ.
చుడువాను తయారు చేసే విధానం..
స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టి అందులో అటుకులను వేసి బాగా కలుపుతూ గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టాలి. కళాయిలో నూనె పోసి వేడెక్కిన తరువాత వేరుశనగ పప్పు (పల్లీలు)ను వేయాలి. ఇవి దోరగా వేగాక పుట్నాల పప్పు వేయాలి. దీంట్లోనే ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి చీలికలు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి. తరువాత కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, అటుకులను వేసి బాగా కలపాలి. చివరగా వెల్లుల్లి తురుము వేయాలి. రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. దీంతో ఎంతో రుచికరమైన చుడువా రెడీ అవుతుంది. ఇందులో పచ్చి ఉల్లిపాయలు, నిమ్మకాయ రసం కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.