Cough And Cold : వాతావరణ మార్పుల కారణంగా తరచూ జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడే వారు చాలా మందే ఉంటారు. వర్షాకాలంలో ఈ సమస్యలతో బాధపడే వారిని మనం ఎక్కువగా చూడవచ్చు. వీటి నుండి బయటపడడానికి యాంటీ బయాటిక్స్ ను వాడుతుంటారు. తరచూ యాంటీ బయాటిక్స్ ను వాడడం కూడా అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి ఖర్చు లేకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం జలుబు, దగ్గు, సాధారణ జ్వరం వంటి వాటి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.
మన వంటింట్లో ఉండే వాటిని ఉపయోగించి మనం జలుబు, దగ్గు, కఫం వంటి వాటిని తగ్గించుకోవచ్చు. దగ్గు, కఫం వంటి వాటితో బాధపడుతున్నప్పుడు శొంఠి పొడిని, మిరియాల పొడిని సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమానికి కొద్దిగా తేనెను కలిపి అర టీ స్పూన్ మోతాదులో రోజుకు మూడు పూటలా తీసుకుంటూ ఉంటే దగ్గు, కఫం తగ్గిపోతాయి. శొంఠిని, మిరియాలను, పిప్పళ్లను సమపాళ్లల్లో తీసుకుని వేయించి వాటిని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా తేనెను కలిపి తీసుకుంటే కఫంతో కూడిన దగ్గు తగ్గుతుంది.
ఒక కప్పు పెరుగును, ఒక కప్పు నీళ్లను, చిటికెడు దాల్చిన చెక్క పొడిని, చిటికెడు జీలకర్ర పొడిని, రెండు యాలకులను జార్ లో వేసి మిక్సీ పట్టుకుని తాగినా కూడా జలుబు, దగ్గు వంటివి తగ్గుతాయి. అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ తులసి ఆకుల రసాన్ని, ఒక టేబుల్ స్పూన్ అల్లం రసాన్ని అర టీ స్పూన్ తేనెతో కలిపి ఉదయం పూట తీసుకున్నట్టయితే జలుబు, దగ్గు, కఫం తో కూడిన దగ్గు, సాధారణ జ్వరం వంటివి తగ్గుతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్పభ్రావాలు లేకుండా సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.