Sleep : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో నిద్రలేమి సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ప్రస్తుత తరుణంలో పడుకోగానే నిద్రపోయే వారిని అదృష్టవంతులుగా భావించాల్సిన పరిస్థితి నెలకొంది. మానసిక ఆందోళన, ఒత్తిడి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా చాలా మందికి రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టడం లేదు. ఈ సమస్య కారణంగా 2 లేదా 3 గంటల కంటే ఎక్కువగా నిద్రపోవడం లేదు. తగినంత నిద్రలేని కారణంగా మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి మద్యం సేవించడం, నిద్ర మాత్రలు మింగడం వంటివి చేస్తూ ఉంటారు. వీటి కారణంగా మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండానే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి మనం నిద్రలేమి సమస్య నుండి బయట పడవచ్చు. నిద్రలేమి సమస్యను నయం చేసే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనం గుమ్మడి విత్తనాలను, ఎండు ఖర్జూరాలను, గసగసాలను, బాదం పప్పును ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి విత్తనాలను తీసుకోవాలి. తరువాత 4 బాదం పప్పులను, ఒక టేబుల్ స్పూన్ గసగసాలను, 2 గింజలు తీసిన ఎండు ఖర్జూరాలను తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని మనం ఎక్కువ మొత్తంలో చేసుకుని నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ రాత్రి పడుకోవడానికి అర గంట లేదా గంట ముందు ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తిని.. తరువాత పాలు తాగాలి.
ఇలా చేయలేని వారు పాలలోనే నేరుగా ఈ పొడిని కలుపుకుని తాగవచ్చు. ఈ విధంగా ప్రతిరోజూ చేయడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గు ముఖం పట్టి చక్కని నిద్రను సొంతం చేసుకోవచ్చు. ఇలా పొడిని తయారు చేసుకుని తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గడంతోపాటు గురక సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఉదయాన్నే మలబద్దకం సమస్య కూడా ఉండదు. ఈ చిట్కా తయారీలో మనం ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. ఈ చిట్కాను పాటించడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలగడంతోపాటు నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది.