Onion Chutney : సాధారణంగా మనం ఇడ్లీ, దోశ వంటి బ్రేక్‌ఫాస్ట్‌లను తినేందుకు పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ వంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తుంటాం. అయితే ఇవే కాదు.. ఆయా అల్పాహారాల్లోకి ఉల్లిపాయల చట్నీ కూడా బాగానే ఉంటుంది. దీన్ని కాస్త శ్రమించి తయారు చేయాలే కానీ రుచి అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఇడ్లీ, దోశ వంటి వాటితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. ఇక ఉల్లిపాయలతో చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన ఉల్లిపాయలు – 2 (పెద్దవి), ఎండు మిర్చి – 8 లేదా తగినన్ని, నూనె – అర టేబుల్ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, చింతపండు – 15 గ్రాములు, పసుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ.
ఉల్లిపాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత ఎండు మిర్చిని వేసి వేయించుకోవాలి. ఎండు మిర్చి వేగిన తరువాత ధనియాలను వేసి ఒక నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే చింతపండును వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలను, ఉప్పును వేసి కలుపుతూ ఉల్లిపాయ ముక్కలను పూర్తిగా వేయించాలి. తరువాత పసుపు వేసి కలపాలి.
ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండు మిర్చి పేస్ట్ ను, కొద్దిగా నీటిని పోసి కలపాలి. తరువాత కళాయిపై మూతను ఉంచి నీళ్లు దగ్గరపడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి వేయించుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కలిపి కళాయిపై మూతను ఉంచాలి. ఈ మిశ్రమాన్ని మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ చట్నీ తయారవుతుంది. దీనిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసిన ఉల్లిపాయ చట్నీతో ఉదయం చేసే అల్పాహారాలను తింటే చాలా రుచిగా ఉంటాయి.