ఆహారంలో పులుపు పదార్థాలు, ఊరగాయలు తదితర ఆమ్ల గుణాలు కలిగిన పదార్థాలను ఎక్కువగా తినేవారికి సహజంగానే మూత్రంలో ఆమ్లత్వం పెరిగి మంటగా అనిపిస్తుంది. దీన్ని డిజూరియా అంటారు. మూత్రంలో బాక్టీరియా దోషం వల్ల, సుఖ వ్యాధుల వల్ల కూడా ఈ మంట వస్తుంటుంది. మూత్ర పరీక్ష, రక్తపరీక్షలు చేస్తేనే ఈ సమస్య ఎందుకు వచ్చిందో కారణం తెలుస్తుంది.
తరచూ అకారణంగా వచ్చే చలి జ్వరం, వికారం, వాంతి, పొత్తి కడుపులో నొప్పి, చిరాకుగా ఉండడం, మూత్రంలో దుర్వాసన, మూత్రానికి పదే పదే వెళ్లాల్సి రావడం, మంట తెలియకుండానే మూత్రం బొట్లు బొట్లుగా లీక్ అవడం, మూత్రం సరిగ్గా రాకపోవడం లాంటి అనుబంధ సమస్యలు కూడా ఉంటాయి.
ఆహార పానీయాలు ప్రముఖంగా ఈ మంటకు కారణమవుతుంటాయి. బాక్టీరియా దోషాలు, ఎండల కారణంగా లేదా శ్రమ కారణంగా శరీరంలో నీటి ధాతువు తగ్గిపోయి శోష ఏర్పడడం, ప్రోస్టేట్ గ్రంథితో తేడాలు, షుగర్ ఉండడం.. వంటివన్నీ మూత్రంలో మంట కలగడానికి కారణాలే.
స్త్రీలలో జననాంగం దగ్గర ఏర్పడే ఇతర వ్యాధులు మూత్రంలో మంటకు కారణం కావచ్చు. మెనోపాజ్ కూడా ఒక్కోసారి దీనికి కారణం అవుతుంది.
వేడి చేసినందు వల్ల మంటగా మూత్రం వస్తుంటే రెండు మూడు గ్లాసుల నీళ్లను గానీ, బార్లీ జావను గానీ, కొబ్బరినీళ్లను గానీ, పలుచని మజ్జిగను కానీ తాగితే పసుపుదనం, మంట తగ్గి మూత్రం సాఫీగా వస్తుంది. ఉసిరికాయ రసం తీసి తాగితే త్వరగా మంట తగ్గుతుంది.
మూత్ర విసర్జన సమయంలో చిక్కని స్రావం లేదా చీము జననాంగం నుంచి వెలువడుతుంటే లోపల బ్లాడర్ నుంచి జననాంగం లోపలి భాగం వరకు ఉన్న ప్రాంతంలో ఎక్కడో పుండు లాంటిది ఏర్పడిందని అర్థం. ఇలాంటప్పుడు సరైన యాంటీ బయోటిక్స్ వాడాల్సి ఉంటుంది.
ధనియాల పొడిని నీళ్లలో వేసి బాగా మరిగించి తాగితే మూత్రంలో మంట త్వరగా తగ్గుతుంది. జననాంగాల దగ్గర పరిశుభ్రత కూడా ఈ వ్యాధిలో ముఖ్యమే. తరచూ మూత్రంలో మంట వస్తుంటే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది.
గోక్షూరాది చూర్ణం, చంద్ర ప్రభావటి, చందనాసవం లాంటి ఆయుర్వేద ఔషధాలు మంచి ఆయుర్వేద వైద్యుడి సలహా మేరకు వాడుకోవచ్చు. మంచి గంధం చెక్కని సాన మీద అరగదీసి ఒక చెంచా గంధంలో ఒకటి లేదా రెండు పలుకులు పచ్చ కర్పూరం కలిపి కొద్ది సేపు ఆరనిస్తే మాత్ర కట్టుకోవడానికి వీలుగా అవుతుంది. బఠానీ గింజలతం ఉండలుగా చేసుకుని పూటకు రెండు ఉండల చొప్పున మూడు పూటలా తీసుకోవాలి. మూత్రంలో మంట త్వరగా తగ్గుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365