Henna Hair Pack : మనం అందంగా కనిపించేలా చేయడంలో జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుత తరుణంలో జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. చుండ్రు, జుట్టు తెల్లబడడం, జుట్టు పొడిబారడం, జుట్టు రాలడం, జుట్టు చిట్లడం వంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సంబంధిత సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. సహజసిద్ధంగా ఈ సమస్యలన్నింటి నుండి మనం బయటపడవచ్చు. జుట్టు సంబంధిత సమస్యల నుండి బయటపడడంలో మనకు సహజసిద్ధంగా తయారు చేసిన హెన్నా పొడి ఎంతగానో ఉపయోగపడుతుంది.
మనలో చాలా మంది తరచూ హెన్నాను ఉపయోగిస్తూ ఉంటారు. కేవలం హెన్నా పొడినే కాకుండా దానికి ఇతర పదార్థాలను కూడా కలిపి పేస్ట్ లా చేసుకుని వాడడం వల్ల కూడా జుట్టు సంబంధిత సమస్యలన్నీ తగ్గి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచే హెన్నా మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. ఈ పేస్ట్ తయారీలో ఉపయోగించే పదార్థాలు ఏమిటి.. దీనిని ఎలా వాడాలి.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందుకోసం మనం ఒక కప్పు హెన్నా పౌడర్ ను, ఒక టేబుల్ స్పూన్ మందార పువ్వుల పొడిని, ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును, తగినంత డికాషన్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో హెన్నా పౌడర్ ను, నిమ్మరసాన్ని, మందార పువ్వుల పొడిని, కలబంద గుజ్జును వేసి కలపాలి. తరువాత తగినంత డికాషన్ ను పోస్తూ పేస్ట్ లా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ను మరీ పలుచగా కలుపుకోకూడదు. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ను జుట్టంతటికీ పట్టించి ఆరే వరకు ఉంచాలి. తరువాత ఎటువంటి షాంపూను ఉపయోగించకుండా తలస్నానం చేయాలి.
జుట్టును ఒక రోజంతా అలాగే వదిలేసి మరుసటి రోజు షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలన్నీ తగ్గుతాయి. ఇందులో ఉపయోగించే మందార పువ్వుల పొడి మనకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది లేదా దీనిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మందార పువ్వులను ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకుని ఉపయోగించాలి. ఈ హెన్నా మిశ్రమంలో ఉపయోగించేవన్నీ కూడా మనకు తక్కువ ధరలో సహజసిద్ధంగా లభించేవేవి. కనుక వీటిని వాడడం వల్ల జుట్టుకు ఎటువంటి హాని కలగదు. అంతేకాకుండా జుట్టు సమస్యలన్నీ తొలగిపోయి జుట్టు నల్లగా, ఒత్తుగా, కాంతివంతంగా తయారవుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.