ఇంట్లో బొద్దింకలు తిరగడం అనేది సహజమే. ముఖ్యంగా కిచెన్, బెడ్‌రూమ్‌లలో బొద్దింకలు తిరుగుతుంటాయి. బాత్‌రూమ్‌లోనూ ఇవి కనిపిస్తాయి. బొద్దింకలను చూస్తే కొందరికి ఒళ్లంతా తేళ్లు, జెర్లు పాకుతున్నట్లు అనిపిస్తుంది. దీంతో వారు భయంతో పరుగులు తీస్తారు. ఇక మహిళలకు అయితే బొద్దింకలు అంటే కాసింత భయం ఎక్కువగానే ఉంటుంది. అయితే కింది తెలిపిన చిట్కాలను పాటిస్తే ఇంట్లోని బొద్దింకలను సులభంగా వదిలించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. పసుపు రంగు అంటే బొద్దింకలకు చాలా ఇష్టమట. ఆ రంగు వైపు అవి ఆకర్షితమవుతాయి. అందువల్ల ఆ రంగులో ఉండే వస్తువులు, పదార్థాలను కిచెన్‌లో ఉంచరాదు. వాటిని బొద్దింకలకు కనిపించకుండా దాచేయాలి. దీంతో బొద్దింకలు తిరగవు.
2. దోసకాయ ముక్కల నుంచి వచ్చే వాసన బొద్దింకలకు పడదు. కనుక వాటిని ముక్కలుగా కోసి కిచెన్‌లో అక్కడక్కడా ఉంచాలి. దీంతో బొద్దింకలు పారిపోతాయి.
3. ఇంట్లో బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో కొద్దిగా బోరిక్ పౌడర్‌ను చల్లాలి. దీంతో బొద్దింకలు మాయమవుతాయి.
4. బొద్దింకలపై సబ్బు నీళ్లను చల్లితే వెంటనే అవి చనిపోతాయి.
5. బోరిక్ పౌడర్, చక్కెర పొడి, మొక్కజొన్న పిండిలను సమాన భాగాల్లో తీసుకుని బాగా కలిపి బొద్దింకలు వచ్చే చోట ఉంచాలి. ఆ మిశ్రమాన్ని తిన్న బొద్దింకలు వెంటనే చనిపోతాయి.
6. ఇంట్లో ఆహార పదార్థాలను కింద పడకుండా చూసుకోవాలి. ఆహార పదార్థాలు కింద పడితే బొద్దింకలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆహార పదార్థాలను కింద పడనీయరాదు. పడినా వెంటనే శుభ్రం చేయాలి. దీంతో బొద్దింకలు రావు.
7. కిచెన్‌లో ఎప్పుడూ ఒకే చోట వంట పాత్రలను ఉంచరాదు. వాటి స్థానాలను మారుస్తుండాలి. దీంతో బొద్దింకలు రావు.