సర్టిఫికెట్లు… ముఖ్యమైన డాక్యుమెంట్స్… ఓటర్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు.. ఇతర కార్డులు.. ఇలా చెప్పుకుంటూ పోతే మనలో చాలా మంది ఇలాంటి డాక్యుమెంట్స్, కార్డులను లామినేషన్ తీయించి పెట్టుకుంటారు. ఇక కొందరైతే వీటిని ప్లాస్టిక్ కార్డుల రూపంలోకి కలర్ జిరాక్స్ తీయించి తయారు చేయించుకుంటారు. వీటి వల్ల ఆయా డాక్యుమెంట్స్, కార్డులు సురక్షితంగా ఉంటాయని, మాటి మాటికీ వాటి ఒరిజినల్స్ వాడాల్సిన పనిలేకుండా సేఫ్‌గా ఇంట్లో పెట్టుకోవచ్చని చాలా మంది భావిస్తారు. అయితే ఏ డాక్యుమెంట్ లేదా కార్డును అయినా ఇలా లామినేషన్ లేదా ప్లాస్టిక్ కార్డు రూపంలోకి మార్చుకోవచ్చు. కానీ ఆధార్ కార్డులను మాత్రం అలా చేయరాదు. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకో తెలుసా..?
యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్ కార్డుల లామినేషన్, వాటి ప్లాస్టిక్ (పీవీసీ) కార్డుల తయారీపై హెచ్చరికలు జారీ చేసింది. ఆధార్ కార్డులను లామినేషన్ చేయించినా లేదంటే వాటిని ప్లాస్టిక్ కార్డుల రూపంలో తయారు చేయించినా ఒరిజినల్ ఆధార్ కార్డుపై ఉండే క్యూ ఆర్ కోడ్‌ను ఇతరులు స్కానింగ్ చేసేందుకు అవకాశం ఉంటుందని, తద్వారా మన ఆధార్ వివరాలు ఇతరులకు తెలుస్తాయని అధికారులు హెచ్చరించారు.
అలాగే ఆధార్ కార్డులను లామినేషన్ చేయించడం లేదా పీవీసీ కార్డుల రూపంలో తయారు చేయించడం చేస్తే వాటిపై ఉండే క్యూ ఆర్ కోడ్ పనికి రాకుండా పోతుందని, దాన్ని మనం యాక్సెస్ చేయలేమని యూఐడీఏఐ హెచ్చరించింది. ఇక ఆయా సందర్భాల్లో లామినేషన్ చేసేవారు, కార్డులను తయారు చేసేవారు మన ఆధార్ కార్డు వివరాలను స్టోర్ చేసి వాటిని వాడుకుంటారని, మన సమాచారం చోరీ అవుతుందని యూఐడీఏఐ హెచ్చరించింది. కనుక వీటికి బదులుగా నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ఆధార్ కాపీ లేదా ఫోన్లో డిజిటల్ రూపంలో ఎం ఆధార్ కాపీని చూపించి ఆధార్ ను వాడుకోవాలని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. కాబట్టి మీరు కూడా ఆధార్ కార్డును లామినేషన్ చేయిస్తున్నా, పీవీసీ కార్డులా తయారు చేయిస్తున్నా ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీ ఆధార్ సమాచారం చోరీకి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది..!