రాత్రి పూట రోడ్ ల పై ప్రయాణించే చాలా సార్లు దీన్ని చూసి ఆశ్చర్య పోయే వాడిని. ఈ రోజు ఇలా దీన్ని చదివి మీకు చెప్పే అవకాశం లభించినందుకు కృతజ్ఞుడిని . దీన్నే కొన్న్నిచోట్ల కేట్స్ ఐ(cats eye) అంటే పిల్లి కళ్ళు అని కూడా పిలుస్తారు. ఇందులో పనిచేసే విధానంని రిట్రో రిఫ్లేక్షన్ (Retro reflection) అనువాదం చేసుకుని తిరోగమన ప్రతిబింబం అని పిలుచుకుందాం. మాములుగా ఏదైనా కాంతి కిరణం మెరిసే ఫలకం పై పడినప్పుడు నలువైపులా పరావర్తనం లేదా ప్రతిఫలనం చెందుతుంది. కానీ ఇక్కడ అలా కాకుండా, ఏ కాంతి మూలం నుండి కిరణం వస్తున్నదో, తిరిగి అక్కడికే పరావర్తనం లేదా ప్రతిఫలనం జరగటం ఇందులోని మూల సూత్రం . ఈ పరికరాన్ని కనిపెట్టింది ఇంగ్లాండ్ కి చెందిన పెర్సీ షా ( Percy shaw ,1933 ). ఈయన రిఫ్లెక్టింగ్ రోడ్ స్టడ్ లిమిటెడ్ అనే సంస్థ స్థాపించి వీటిని తయారు చేసే కంపనీ పెట్టాడు . ఈయన పిల్లుల నేత్రాలు ఎలా మెరుస్తాయో చూసి వాటినుంచి ప్రేరణ పొంది ఇది చేసాడట.
ఈ రకం పరికరం ఒక రబ్బరు తొడుగులో ఉండే లోహ భాగం. ఇందులో ఇరువేపులా మెరిసే రెండు పరా వర్తన ఫలకాలు లేదా దీపాలు ఉంటాయి. ఇప్పుడిప్పుడే సాంకేతికత పెరిగి దీనిలో కొత్త రకాలు వచ్చాయి. వీటిని రోడ్ స్టడ్ లు అని అనటం కూడా ఉంది. వీటిని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి క్రియాశీల (active ): ఇందులో తనంతట తానే వెలగ గల వ్యవస్థ ఉంటుంది. అంటే అవి చీకటి పడగానీ వెలుగుతూ ఉంటాయి. పైన ఉన్న సౌర ఫలకాల నుంచి కాంతిని గ్రహించి లోపలి ఎల్ఈడి దీపం వెలుగుతుంది. రెండు నిష్క్రియా శీల(passive ) : ఇవి ఎటువంటి కాంతి ఉత్పాదకత లేకుండా,కేవలం తనపై పడిన కాంతిని మాత్రం పరావర్తన చేయగలవు. అంటే ఇవి వాహనం లేనప్పుడు వెలగవు అన్నమాట.
ఇంకా వీటిలో లోహపు, రబ్బరు, రోడ్డు కంటే కొంచెం ఉబ్బుగా ఉండేవి ,రోడ్డు ఎత్తులోనే ఉండేవి, అలాగే పసుపు, ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండేవి ఇలా భేధాలు చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ వి పెద్ద మన్నిక లేక తక్కువ ఖరీదులో దొరుకుతాయి. లోహపు స్టడ్ లు ఎక్కువ మన్నిక ఉంటాయి. రెండింటి నుంచి వచ్చే కాంతి లో కూడా వ్యత్యాసం ఉంది . వీటివల్ల బోలెడు ప్రాణాలు కాపాడ బడుతున్నాయి. ఒకరకంగా డ్రైవర్ల కి ఇవి రక్షా కవచం. రాత్రి పూత మలుపుల్లో ఆనవాలు కోసం, ఎక్కువ లేన్ లు ఉన్న రోడ్డు లో సరిహద్దు కోసం ,రోడ్డు పక్కన ఉన్న పేవ్ మెంట్ చూపటం కోసం , చీకటి దారుల్లో అడవులు లాంటి చోట్ల ఎంతో ఉపయోగకరం. ఇవి వెలగక పోయినా హైవే లో ఒక లేన్ నుంచి ఇంకో లేన్ మారుతున్నప్పుడు వీటిమీద టైరు పడి వచ్చే కుదుపు కూడా ఒక సూచిక అనటం లో ఆశ్చర్యం లేదు. డ్రైవింగ్ అనుభవం ఉన్న వారికి ఇది తెలిసిందే . ఇంతే కాదు పాదాచారుల దాటే స్థలం దగ్గర కూడా ఇవి వెలిగి జాగ్రత్త చెపుతాయి.