Post Office Scheme : మనదేశంలోని పౌరులకు పోస్టాఫీస్ అనేక పథకాలను అందిస్తోంది. పోస్టాఫీస్‌లో డబ్బులు పొదుపు చేస్తే కచ్చితమైన లాభాలను పొందడంతోపాటు మన డబ్బుకు రక్షణ కూడా ఉంటుంది. పైగా వడ్డీని కూడా ఎక్కువగానే చెల్లిస్తారు. కనుకనే పోస్టాఫీస్ ఎప్పటికప్పుడు అనేక కొత్త పథకాలను ప్రజలకు అందిస్తూ వస్తోంది. ఇక పోస్టాఫీస్ అందిస్తున్న ఆర్‌డీ (రికరింగ్ డిపాజిట్) స్కీమ్ ద్వారా చిన్న మొత్తాల్లో డబ్బును పొదుపు చేస్తూ ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బును లాభంగా పొందవచ్చు.
పోస్టాఫీస్ అందిస్తున్న ఆర్‌డీ స్కీమ్ ద్వారా కనీసం 5 ఏళ్ల పాటు డబ్బును పొదుపు చేయాలి. ఈ డబ్బుకు పూర్తి రక్షణ ఉంటుంది. నెలకు కనీసం రూ.100 పొదుపు చేయవచ్చు. గరిష్టంగా ఎంతైనా పొదుపు చేయవచ్చు. లిమిట్ లేదు. ముగ్గురు వ్యక్తులు కలసి ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. 10 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దగ్గర ఉండి ఈ స్కీమ్‌ను ఓపెన్ చేయించవచ్చు. ఈ స్కీమ్‌లో డబ్బును చిన్నారుల పేరిట పొదుపు చేస్తే వారు పెద్దయ్యే సరికి డబ్బు చేతికొస్తుంది. ఇది వారి పెళ్లికి లేదా ఉన్నత చదువులకు పనికొస్తుంది. ఈ స్కీమ్‌లో కనీసం 5 ఏళ్లపాటు డబ్బును పొదుపు చేయాలి. 3 ఏళ్ల పాటు నిరంతరాయంగా నెల నెలా డబ్బును చెల్లిస్తూ పొదుపు చేస్తే డబ్బును ముందుగానే తీసుకోవచ్చు. కానీ వడ్డీ తక్కువ వస్తుంది.
ప్రస్తుతం పోస్టాఫీస్ ఆర్‌డీ ద్వారా డబ్బులను పొదుపు చేస్తే ఏప్రిల్ 2020 గణాంకాల ప్రకారం ఏడాదికి 5.8 శాతం వడ్డీ చెల్లిస్తారు. 3 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కించి ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం కింద రోజుకు రూ.70 అంటే.. నెలకు రూ.2100 జమ చేస్తే 5 ఏళ్లు ముగిసే సరికి ఖాతాలో రూ.1,26,000 ఉంటాయి. దీనికి రూ.20వేలు వడ్డీ కలిపితే రూ.1,46,000 అవుతాయి. అంటే రూ.1.50 లక్షల మేర వస్తాయన్నమాట.
5 ఏళ్లు ముగిశాక ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేయవచ్చు. లేదా మరో 5 ఏళ్లు పథకాన్ని పొడిగించుకోవచ్చు. చిన్న చిన్న మొత్తాలను సురక్షితంగా పొదుపు చేయాలనుకునే వారి కోసం పోస్టాఫీస్ ఆర్‌డీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.