ఇది నలభయి ఏళ్ళ కిందటి సంగతి. మా ఊరికి మీటర్ గేజి రైలు బండి వచ్చేది. గుప్పు గుప్పు మని పొగ వదులుతూ,పెద్ద దర్జాగా ఉండేది దాని రాజసం. ఊరి బయట ఉన్నప్పుడే దాని కూత, దాని శబ్ద లయ విన్యాసాలు, చెవికి చేరేంత శబ్ద కాలుష్యం, తక్కువగా ఆరోజుల్లో ఊరిలో ఉండేదేమో. అక్కడి నుంచి కథ మొదలెడదాం. ఆ పొగ బండ్ల కి ఒక వైపే ముఖం, సరదాగా దాన్ని ఏకముఖి అనుకుందాం. ఇప్పుడొస్తున్న డీజిల్, విద్యుత్ ఇంజిన్లకి రెండు వైపులా ముఖాలు. ఇవి ద్విముఖి లన్న మాట. ఇందులో డీజిల్ ఇంజిన్ లో ఒక వైపే ముఖం ఉన్నా, పక్కన ఉన్న నడవా లాంటి ఏర్పాటు వల్ల డ్రైవర్ కి ముందు భాగం కూడా కనపడే ఏర్పాటు ఉంటుంది. ఇక విద్యుత్ ఇంజిన్ లో అయితే ఏవైపు కావాలంటే అక్క,డ డ్రైవర్ గారు వెళ్లి కూర్చుని అటునుంచి నడిపెయోచ్చు. మరి ఏకముఖి పొగ బండ్ల మాటేమిటి?.
అందు కోసం రెండు ఏర్పాట్లు ఉండేవి .అందులో మొదటిది వై (WYE) లేదా బెలూన్ లూప్ (balloon loop) , మూడు పాయింట్ల త్రిప్పు (three point turn). ఇందులో డెల్టా ఆకారంలో పట్టాలు నిర్మిస్తారు. దీని వల్ల, ఒక వేపు ఉండే ఇంజిన్ ముఖం, మూడు అంచెల్లో ఇంకో వేపుకు మారుతుంది. అంటే సులభంగా ఇంజిన్ దిశ మారటానికి అనువైన ఏర్పాటన్న మాట. దీనిలో చిక్కేమిటంటే బోలెడు నిర్మాణం, స్థలం, దాని సంరక్షణ అవసరం అవుతాయి. ఇవన్నీ ఏదైనా రైలు, ఒక చోట ఆగి, తిరిగి వచ్చిన దారినే, వెళ్ళాలంటే (టర్మినస్ ) కావాల్సిన తప్పనిసరి పరికరాలు. అందుకే ఇది అన్ని చోట్ల కనపడదు. ఇక ఈ ప్రశ్నకి ముఖ్య మైన రెండో రకం దగ్గరికి పోదాం. దీన్ని టర్న్ టేబిల్ (turntable) లేదా వీల్ హౌస్ (wheel house) అని పిలుస్తారు. ఇది మా ఊరిలో ఉండేది. సరిగ్గా ఒక ఇంజిన్ లేదా బోగీ పట్టే పొడవులో ఇనుముతో చేసిన వలయాకార నిర్మాణం ఇది. చుట్టూ సిమెంట్ కట్టడంతో పటిష్టంగా ఉండి మధ్యలో ఇనుప బద్దీలతో వంతెన మాదిరిగా కనపడుతుంది.
దీని పైన ఇంజిన్ నిలిపి కదలకుండా ఏదైనా అడ్డుపెట్టి, పక్కనున్న హేండిల్ తో, సులువుగా ముగ్గురు నలుగురు తోసుకుంటూ, సరిగ్గా 180 డిగ్రీలు తిప్పి వేయగల ఒక వింతైన పరికరం. ఆకాలంలో రైలు చాలాసేపు దీనికోసం స్టేషన్లో ఆగేది. లోపల ప్రయాణీకులు, పక్కన పనిలేని నా బోటి వారు, గుంపుగా మూగి ఈ పరికరంతో తక్కువ బలంతో ఎక్కువ పని ఎలా చేయవచ్చో చూసి, వీలైతే ఒక చేయి వేసి ( ఆ పని కెటు మనుషులు కావాలిగా) చూద్దాం అనుకునే ఖాళీ ఉన్న రోజులు అవి. ఈ రోజుల లెక్కల్లో, బహుశా సెల్ లేదు కనక, అందువల్ల మిగిలిన వృధా సమయమేమో. కొన్నిరోజులు డీజిల్ బండ్లను కూడా ఇలా తిప్పినా చివరికి ఇవన్నీ మూలన పడేసారు. ఇందులో బోగీ లు కూడా తిప్పే సౌకర్యం ఉంది కానీ, ఎక్కువగా బొగ్గు ఇంజిన్లు తిప్పగా చూసిన జ్ఞాపకమే నాకు.